Opinion: కూట‌మి పాల‌న‌లో సంక్షేమానికి భరోసా... అభివృద్ధికి బాటలు

‘స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మారడం రాష్ట్రానికి గర్వకారణం. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికీ పెద్ద పీట వేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తున్నాయి..’ అని రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ విశ్లేషించారు. వారి మాటల్లోనే చదవండి.

Updated on: Oct 30, 2026, 10:25:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

2024 జూన్‌ లో పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుండడంతో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది.

లింగమనేని రమేష్, ఎంపీ(రాజ్యసభ)
లింగమనేని రమేష్, ఎంపీ(రాజ్యసభ)

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒకవైపు ప్రజా సంక్షేమానికి, మరోవైపు రాష్ట్రాభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తుండడంతో అన్ని వర్గాల వారు సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కుంటుబడిన సమయంలో కూటమిపై విశ్వాసంతో ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, పారిశ్రామిక పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆంధ్రప్రదేశ్ విధ్వంసం నుంచి వికాసం వేపు పయనిస్తూ సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర దిశగా పరిగెడుతోంది.

గుంతలు లేని రహదారులు

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది అని భావించిన కూటమి ప్రభుత్వం ప్రధానంగా పల్లెల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతిస్తూ రూ.861 కోట్లతో 20,060 కిలోమీటర్ల గుంతలు లేని రహదారులు నిర్మించడంతో పాటు, మరో రూ.2,500 కోట్లతో పలు రహదారి పనులకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నాణ్యత మెరుగుపరచడం, ప్రధాన రహదారులతో అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రయాణ సౌకర్యాలు కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమంతో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11,085 కోట్ల పనులు నిర్వహించారు. అంతేకాక గిరిజన ప్రాంతాల్లో రహదారి పనులను ప్రభుత్వం ‘అడవితల్లి బాట’ కార్యక్రమం ద్వారా 905 కిలోమీటర్ల పనులు పూర్తి చేసింది. మారుమూల గ్రామాలకు రహదారులు చేరితే విద్య, వైద్యం, మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

తాగునీరు, సాగునీరు

తాగునీరు, సాగునీటి సదుపాయాలు మెరుగుపరిచి గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచే దిశగా చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వం పోలవరం, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులు, దవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ, తుంగభద్ర గేట్ల మార్పు పనులు వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుండడంతో సకాలంలో పనులు పూర్తయే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం 26 నెలల్లో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశారు. పోలవరం నిర్వాసితులకు రూ.2,250 కోట్లు, వెలిగొండ నిర్వాసితులకు రూ.768 కోట్ల పరిహారం అందించారు. సాగునీరు, రహదారులు సమన్వయంతో అభివృద్ధి చెందితే వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతోపాటు, రైతులకు మార్కెట్లతో మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది.

రాజధాని నగరంలో..

రాష్ట్ర విభజన వేళ సరైన రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌ కు చారిత్రాత్మకమైన అమరావతియే కాపిటల్ సిటీ అనే బలమైన నిర్ణయంతో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తోంది. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి వేగవంతం చేస్తూ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ప్రజా రాజధానిని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధాని మోదీ 2025 మేలో అమరావతిలో రూ.58 వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాలు ఏర్పాటవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీ విధానంతో భోగాపురంలో సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో రూ.5,640 కోట్లకు పైగా వ్యయంతో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి గొప్ప వరం.

పెట్టుబడులు ఆకర్షిస్తూ..

పారిశ్రామిక రంగంలోనూ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుంది. 2024 జూన్ నుంచి 714 ప్రాజెక్టుల రూపంలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. వీటిలో రూ.16.6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు లభించగా, రూ.4.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు కార్యరూపంలోకి వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా 7.1 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. విశాఖపట్నంలో ఐటీ, డేటా సెంటర్లు, కాకినాడలో గ్రీన్ అమోనియా, అనకాపల్లిలో ఉక్కు పరిశ్రమతోపాటు ఇతర ప్రాంతాల్లో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి.

సంక్షేమానికి పెద్దపీట

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలిస్తున్న కూటమి ప్రభుత్వం మహిళా సాధికారితకు అధిక ప్రాధాన్యతిస్తోంది. ఇందులో భాగంగా తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. తల్లికి వందనం కింద రెండేళ్లలో రూ.20,210 కోట్లు చెల్లించగా, స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా 90 కోట్ల ప్రయాణాలు చేశారు. దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు చొప్పున 4.61 కోట్ల ఉచిత సిలిండర్లు పంపిణీ అయ్యాయి.పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను దురుద్దేశంతో గత ప్రభుత్వం మూసివేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను ప్రారంభించడంతో 11.60 కోట్ల భోజనాల పంపిణీ జరుగుతుండడంతో ప్రజలు తృప్తిగా కడుపు నిండా భోజ‌నం చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద వివిధ వర్గాల పెన్షన్ల కోసం రూ.73,507 కోట్లు ఖర్చు చేసింది.

రాష్ట్రానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతిచ్చింది. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రూ.12,110 కోట్లు అందించడమే కాకుండా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించి 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. నిరుపేదలందరికీ గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయడమే కాకుండా, మరో 5 లక్షల నిర్మాణాలు చేపట్టనుంది. సామాజిక వర్గాల సంక్షేమం కింద మత్స్యకారులకు రూ.505 కోట్లు, గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు, స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మైనార్టీ సంక్షేమానికి ఈ ఏడాది రూ. 3670 కోట్లు కేటాయించారు. యువత ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం మెగా డీఎస్సీతో 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, 5,757 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు పూర్తి చేయడంతో పాటు స్టైఫండ్‌ ను 12,500కు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో ప్రయివేట్ ఉద్యోగ అవకాశాలూ పెరిగాయి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1,035 సేవలను అందుబాటులోకి తీసుకొని రావడంతో ఆంధ్రప్రదేశ్ దేశానికి స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం, చెత్త పన్ను రద్దు వంటి చర్యలు పాలనలో మార్పులకు నిదర్శనం.

కొత్త దిశలో అభివృద్ధి

కూటమి ప్రభుత్వ ప్రస్థానంలో పారదర్శకత, నాణ్యత, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యతిస్తూ చేపడుతున్న కార్యక్రమాలు, పనులతో ‘విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వైపు’ దిశగా ప్రజలకు సుపరిపాలన అందుతోంది. అమరావతి నుంచి భోగాపురం వరకు, పల్లె రహదారుల నుంచి భారీ పారిశ్రామిక ప్రాజెక్టుల వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొత్త దిశగా సాగుతోంది. నీటి ప్రాజెక్టులు రైతులకు అండగా నిలుస్తుండగా, పెట్టుబడులు యువతకు ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతున్నాయి. అభివృద్ధి ఫలాలు ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి విజయవంతంగా చేరుతుండడంతో నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌ గా రూపుదిద్దుకుంటుంది. రాష్ట్రాభివృద్ధి కూటమితోనే సాధ్యమనే విశ్వాసంతో ప్రజలు 2024లో కూటమిని గెలిపించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ప్ర‌జ‌ల‌ ఆశీర్వాదాలతో విజయవంతంగా సాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతంగా సాగేలా ప్రజలు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం మ‌ధ్య డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారుతో దూసుకుపోతున్న రాష్టాభివృద్ధి, స్థానిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి కూట‌మి విజ‌యంతో ట్రిపుల్ ఇంజిన్ స‌ర్కారుగా ఏర్ప‌డి ప‌ట్ట‌ణాల‌ నుండి గ్రామ స్థాయి వ‌ర‌కు అభివృద్ధి, సంక్షేమాల్లో రాష్ట్రం చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం.

వ్యాసకర్త:

- లింగ‌మ‌నేని ర‌మేశ్‌,

పార్ల‌మెంట్ స‌భ్యులు (రాజ్య‌స‌భ‌)

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, వ్యూహాలు, విశ్లేషణలు, ఆకాంక్షలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More