పులివెందులలో జగన్‌కు బిగ్ షాక్.. 65 ఎంపీటీసీల్లో కూటమి ఖాతాలోకి 64 స్థానాలు!

పులివెందులలో 65 ఎంపీటీసీల్లో 64 ఏకగ్రీవమై కూటమి ఖాతాలోకి వెళ్లాయి. అంతేకాదు కూటమి ఖాతాలోకి 3 జెడ్పీటీసీలు కూడా చేరాయి.

Published on: Oct 27, 2026, 18:25:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పరిషత్ (జడ్పీటీసీ, ఎంపీటీసీ) స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) ఏకగ్రీవాలతో దూసుకెళ్లింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల హోరు కనిపిస్తుండగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్నడూ లేనివిధంగా మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకుంది.

పులివెందులలో కూటమి హవా
పులివెందులలో కూటమి హవా

పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవాలతో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 64 స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం. అలాగే మొత్తం 7 జడ్పీటీసీ స్థానాల్లో 3 స్థానాలను కూటమి ఇప్పటికే కైవసం చేసుకుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగించింది.

వేంపల్లి మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ 15, భారతీయ జనతా పార్టీ 1, జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. కేవలం అల్లిరెడ్డిపల్లె ఎంపీటీసీ స్థానానికి మాత్రమే పోలింగ్ జరగనుంది.

పులివెందుల మండలంలో ఇక్కడి 5 ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. వేముల మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ ఘనవిజయం సాధించింది. చక్రాయపేట మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలనూ కూటమి ఏకగ్రీవం చేసుకుంది. తొండూరు మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ వశమయ్యాయి. సింహాద్రిపురం మండలంలో 8 ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు.

మరోవైపు రాయలసీమలోని ఇతర జిల్లాల్లోనూ అధికార కూటమి ఏకగ్రీవాల జోరు కొనసాగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అవి యాదమర్రి జడ్పీటీసీ యశోద, బంగారుపాళెం జడ్పీటీసీ సుచిత్ర జయప్రకాష్, పూతలపట్టు జడ్పీటీసీ శైలజ తేజో మూర్తి.

నంద్యాల జిల్లాలో సైతం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి తీవ్ర నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 జడ్పీటీసీ స్థానాలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. బనగానపల్లె నియోజకవర్గంలో బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్ల జడ్పీటీసీ స్థానాలన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి.

డోన్ నియోజకవర్గంలో బేతంచెర్ల, ప్యాపిలి జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు జడ్పీటీసీ స్థానాన్ని కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. పులివెందుల లాంటి వైసీపీ బలమైన స్థానాల్లో కూటమి సాధించిన ఈ ఏకగ్రీవ విజయాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More