...
...
Next Story

రాత్రికి కళింగపట్నం వద్ద తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి సమీపంలో రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది.

Published on: Sep 23, 2026, 20:50:55 IST
Advertisement

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం దాటే సమయంలో సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో తీరం వెంట గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

తీవ్ర వాయుగుండం
తీవ్ర వాయుగుండం

ఈదురుగాలులతో పాటుగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు, పునరావాస కేంద్రాలకు మారాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

గడిచిన 6 గంటల్లో 13 కిలో మీటర్ల వేగంతో కదిలిన తీవ్రవాయుగుండం.. ప్రస్తుతానికి కళింగపట్నానికి 30 కి.మీ దూరంలో ఉంది. విశాఖపట్నానికి 90 కిలో మీటర్ల దూరంలో కేంద్రకృతమైంది.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తీరప్రాంత భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులలో అధికారులు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కఠిన ఆదేశాలు అమలు చేస్తున్నారు.

వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల పాటు కురిసే వర్షపాతం ఆధారంగా వివిధ జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

సెప్టెంబర్ 25వ తేదీ వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టనుంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.

ప్రజల రక్షణార్థం జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున అవసరమైన అత్యవసర వస్తువులు, మంచినీరు, బ్యాటరీ లైట్లను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్ర తీరప్రాంతాల్లోని నివాసితులు అప్రమత్తంగా ఉంటూ స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks