దీపావళి రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ట్రైన్లలో బాణసంచా తీసుకెళ్తే జైలు శిక్ష!

దీపావళి సందర్భంగా ట్రైన్లలో బాణసంచా తీసుకెళ్తే కఠిన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. భారీగా జరిమానా కూడా ఉంటుందని పేర్కొంది.

Updated on: Nov 7, 2026, 13:57:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండుగ, వారాంతపు సెలవుల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేగా, మరోవైపు రైళ్లలో ప్రయాణించే వారి భద్రత కోసం తనిఖీలను తీవ్రతరం చేసింది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్
రైల్వే ప్రయాణికులకు అలర్ట్

దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు రైళ్లలో బాణసంచా, టపాసులు లేదా ఇతర ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్, సీపీఆర్‌వో వై. బాలాజీ కిరణ్ స్పష్టం చేశారు.

రైల్వే చట్టం - 1989 నిబంధనల ప్రకారం.. రైలు ప్రయాణాల్లో పేలుడు పదార్థాలు, బాణసంచా, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్, యాసిడ్ వంటి మండే స్వభావం కలిగిన వస్తువులను రవాణా చేయడం చట్టరీత్యా నేరం. నిబంధనలను ఉల్లంఘించి బాణసంచా లేదా ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా పడుతుంది.

ప్రమాదాలు జరిగి రైల్వే ఆస్తులకు లేదా తోటి ప్రయాణికులకు నష్టం వాటిల్లితే దానికి సంబంధిత వ్యక్తులే చట్టపరంగా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, సివిల్ డిఫెన్స్ సిబ్బందితో పాటు టీటీఈలు, కోచ్ అటెండెంట్లు, స్టేషన్ మేనేజర్లు కలిసి రైళ్లు, పార్సిల్ వ్యాన్లు, ప్రయాణికుల లగేజీలపై ప్రత్యేక కన్నేశారు.

ప్రయాణ సమయంలో ఎవరైనా బాణసంచా లేదా అనుమానాస్పద వస్తువులను తీసుకెళ్తున్నట్లు గమనిస్తే, ప్రయాణికులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 139 కి కాల్ చేసి సమాచారం అందించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

విశాఖ - పార్వతీపురం స్పెషల్ రైలు

రైలు పండుగ రద్దీని దృష్ట్యా విశాఖపట్నం - పార్వతీపురం(Train No. 07268 / 07267) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. 7, 8, 9వ తేదీల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం నుంచి పార్వతీపురం (ట్రైన్ నంబర్ 07268) ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి, మధ్యాహ్నం 12:25 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.

పార్వతీపురం నుంచి విశాఖపట్నం (ట్రైన్ నంబర్ 07267) తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12:35 గంటలకు పార్వతీపురంలో బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, దొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, నర్సీపురం స్టేషన్లలో ఆగుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More