Black Panther : 40 సంవత్సరాల తర్వాత విశాఖ జూ పార్క్‌కు బ్లాక్ పాంథర్

Black Panther : సుమారు 40 సంవత్సరాల తర్వాత విశాఖ జూ పార్క్‌కు బ్లాక్ పాంథర్ వచ్చింది. దీనిని అధికారికంగా విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Published on: Apr 20, 2026 7:21 PM IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల(ఐజీజెడ్పీ)లో ఒక ఆడ నల్ల చిరుతను మంగళవారం (ఏప్రిల్ 21, 2026)నాడు విడుదల చేస్తారు. నిజానికి ఈ జాతి చిరుత చివరిసారిగా జంతు ప్రదర్శనశాలలో 40 ఏళ్ల కిందట ఉండేది. ఇన్ని సంవత్సరాల విరామానికి బ్లాక్ పాంథర్ రాకతో తెరపడుతుంది.

విశాఖ జూ పార్క్‌కు బ్లాక్ పాంథర్
విశాఖ జూ పార్క్‌కు బ్లాక్ పాంథర్

జంతు ప్రదర్శనశాలల మధ్య మార్పిడి కార్యక్రమం కింద గత నెలలో గౌహతిలోని అస్సాం స్టేట్ జూ-కమ్-బొటానికల్ గార్డెన్ నుండి ఈ చిరుతను తీసుకువచ్చారు. సోమవారం (ఏప్రిల్ 20, 2026) నాడు జంతు ప్రదర్శనశాల అధికారులు ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించిన ప్రకారం.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ పి.వి. చలపతి రావు ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 9.30 గంటలకు పార్కులో దీనిని లాంఛనంగా విడుదల చేస్తారు.

జంతువుల మార్పిడి కార్యక్రమం కింద ఈ చిరుతను స్వీకరించామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు. మార్చి 5, 2026న ఈ బ్లాక్ పాంథర్‌ను తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుండి ప్రోటోకాల్‌లకు అనుగుణంగా దీనిని క్వారంటైన్‌లో ఉంచామని అధికారులు వెల్లడించారు.

ఈ చేర్పుతో పార్క్ పరిరక్షణ, ఇతర కార్యక్రమాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని జూ అధికారులు తెలిపారు. నల్ల చిరుత అనేది చిరుతపులిలో ఒక రకం. మెలనిన్ అనే వర్ణద్రవ్యం అధికంగా ఉండటం వల్ల దీని శరీరంపై ఇలా రంగు వస్తుంది. ఈ జాతి ఒంటరిగా, రాత్రిపూట సంచరించే అలవాట్లకు, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో దాని పాత్రకు ప్రసిద్ధి చెందింది.

గౌహతిలోని అస్సాం స్టేట్ జూ-కమ్-బొటానికల్ గార్డెన్ భారతదేశంలో నల్ల చిరుతలకు ఏకైక సంతానోత్పత్తి కేంద్రంగా ఉంది. సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించిన మార్పిడి కార్యక్రమాల కింద ఇతర జూలకు జంతువులను పంపింది.

వైజాగ్‌లో చివరిసారిగా నల్ల చిరుతను 1980ల మధ్యలో ప్రదర్శనకు ఉంచారు. ఇక ఇప్పుడు అధికారికంగా విడుదల చేసిన తర్వాత సందర్శకులు ఈ జంతువును మళ్లీ చూడగలుగుతారు.

భారతదేశంలో జూల మధ్య జరిగే జంతు మార్పిడి పద్ధతి(Animal Exchange Programme) అనేది జంతువుల సంరక్షణ, సంతానోత్పత్తి, జన్యు వైవిధ్యాన్ని కాపాడటానికి ఉపయోగించే ఒక శాస్త్రీయ విధానం. ఈ ప్రక్రియ ప్రధానంగా సెంట్రల్ జూ అథారిటీ పర్యవేక్షణలో జరుగుతుంది.

మొదట రెండు జూల అధికారులు ఏ జంతువులను మార్చుకోవాలనుకుంటున్నారో ఒప్పందం చేసుకుంటారు. ఈ ప్రతిపాదనను సెంట్రల్ జూ అథారిటీకి పంపిస్తారు. జంతువుల ఆరోగ్యం, వయస్సు, స్వీకరించే జూలో ఉన్న సౌకర్యాలను పరిశీలించిన తర్వాతే అనుమతి లభిస్తుంది.

ప్రతి జూకు ఒక 'యానిమల్ కలెక్షన్ ప్లాన్' ఉంటుంది. దాని ప్రకారం మాత్రమే కొత్త జంతువులను తెచ్చుకోవాలి. జంతువులను తరలించే ముందు వాటికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా అంటువ్యాధులు లేవని నిర్ధారించుకోవాలి.

కొత్త జూకి చేరుకున్న తర్వాత, ఆ జంతువును నేరుగా ఇతర జంతువులతో కలపరు. ప్రదర్శనకు పెట్టరు. 30 రోజులకుపైగానే ప్రత్యేక నిఘాలో (క్వారంటైన్) ఉంచి, అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాకే సాధారణ ఎన్‌క్లోజర్‌లోకి వదులుతారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More