శుభకార్యానికి వెళ్లివస్తుండగా కృష్ణా నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న ఒక నాటు పడవ అకస్మాత్తుగా బోల్తా పడిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పండుగ లాంటి వాతావరణం ఉండాల్సిన ఆ ఇంట ఒక్కసారిగా శోకసంద్రం అలుముకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది బంధువులు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామ పరిధిలో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం వారంతా కలిసి కృష్ణా నది గుండా అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ఒక చిన్న నాటు పడవపై తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ప్రయాణం మధ్యలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో పడవ ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలో బోల్తా పడింది.
పడవ బోల్తా పడటంతో అందులో ఉన్న 10 మంది నీట మునిగిపోయారు. వారి కేకలు విన్న కోనూరు గ్రామస్థులు, మత్స్యకారులు వెంటనే నదిలోకి దూకి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మిగిలిన నలుగురు నది ఉధృతికి కొట్టుకుపోయారు.
నదిలో మునిగిపోయిన నలుగురిని గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్ (12), చైతన్య (28)గా గుర్తించారు. స్థానికులు, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురు చిన్నారులు (సంధ్య, సైనీ, కార్తీక్) మృతదేహాలు లభ్యమయ్యాయి. చైతన్య (28) అనే వ్యక్తి గల్లంత అవ్వగా చాలాసేపు గాలించారు. తర్వాత అతడి మృతదేహం కూడా దొరికింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అచ్చంపేట పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వ్యక్తి కోసం కృష్ణా నదిలో గాలింపు చేపట్టారు. దొరికిన తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా నది తీర ప్రాంత గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణికులను నాటు పడవలపై తరలించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని, ఫిట్‌నెస్ లేని పడవలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


