...
...
Next Story

కదులుతున్న రైలులో నుంచి మిస్సింగ్... ఆంధ్రాలో అస్సాం యువతి మృతదేహం - అసలేం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి… తిరిగి తన సొంతూరికి వెళ్తున్న ఓ అస్సాం యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. రైలులో మిస్సైన ఆ విద్యార్థిని మృతదేహం…. ఏపీలోని అటవీ ప్రాంతంలో లభించడం సంచలనంగా మారింది.

Published on: Oct 9, 2026, 11:39:23 IST
Advertisement

స్వస్థలానికి వెళ్లేందుకు రైలు ఎక్కి అదృశ్యమైన అస్సాంకు చెందిన ఓ యువతి… ఆంధ్రా పరిధిలోని రైలు పట్టాల పక్కన శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతురాలిని గౌహతికి చెందిన 21 ఏళ్ల డ్యాన్సర్ హిమాశ్రీ బోరోగా గుర్తించారు. అయితే తన కుమార్తె ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోలేదని…. ఇది కచ్చితంగా హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

ఆంధ్రాలో అస్సాం  యువతి మృతదేహం (representative image (Pixel))
ఆంధ్రాలో అస్సాం యువతి మృతదేహం (representative image (Pixel))

అస్సాంలోని గౌహతి సమీపంలోని బొండా ప్రాంతానికి చెందిన హిమాశ్రీ బోరో తన డాన్స్ బృందంతో కలిసి ఒక నృత్య పోటీలో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చింది. అయితే గౌహతిలో జరగనున్న పరీక్షకు హాజరుకావాల్సి ఉండటంతో, బృందం కన్నా ముందే ఆమె ఒక్కతే ఇంటికి బయలుదేరింది. అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (దాదాపు 12.15 గంటలకు) విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఆమె 22503 కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. స్థానిక పరిచయస్తుడైన ఒక స్నేహితుడు ఆమెను స్టేషన్‌లో దించేందుకు వచ్చాడు. ఆ సమయంలో బోగీలో ఇతర ప్రయాణికులతో పాటు హిమాశ్రీ రైలు ఎక్కుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా నమోదయ్యాయి.

వెలుగులోకి కాల్ వీడియో….

రైలు ఎక్కిన కొద్దిసేపటికే హిమాశ్రీ తన వదినకు, మరొక స్నేహితుడికి ఫోన్ చేసి బోగీలో తన పరిస్థితి బాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బోగీలో చుట్టూ మద్యం సేవించిన పురుషులు ఉన్నారని…. వారితో తనకు భద్రత లేదని, తీవ్ర అసౌకర్యంగా ఉందని చెప్పింది. అంతేకాకుండా రాత్రి 2.30 నుంచి 3.00 గంటల సమయంలో బోగీ లోపలి దృశ్యాలను వీడియో తీసి తన స్నేహితుడికి పంపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది.

ఘటనపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. ఫిర్యాదు అందగానే శ్రీకాకుళం రోడ్ స్టేషన్ వద్ద ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైలును తనిఖీ చేశారని, కానీ ఎస్-2 సహా జనరల్, స్లీపర్ కోచ్‌లలో సదరు యువతి కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లా పరిధిలోని పోందురు - దూసి రైల్వే సెక్షన్ల మధ్య రైలు పట్టాల పక్కన ఒక మహిళ మృతదేహాన్ని ఆర్‌పీఎఫ్ బలగాలు గుర్తించాయి. విచారణలో అది గౌహతికి చెందిన హిమాశ్రీ బోరో మృతదేహంగా నిర్ధారణ అయింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శ్రీకాకుళంలోని ప్రభుత్వ రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు.

నడుస్తున్న రైలు నుంచి కిందపడిపోవడం వల్లే యువతి మరణించి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పలాస జీఆర్పీ, శ్రీకాకుళం ఆర్‌పీఎఫ్ వేర్వేరుగా కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. బోగీలోని తోటి ప్రయాణికులను, విశాఖలో ఆమెను దింపిన స్నేహితుడిని విచారిస్తున్నారు. అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు, రైల్వే భద్రతా బలగాలు సమన్వయంతో విచారణ జరుపుతున్నాయి.

గౌహతిలో విద్యార్థుల నిరసన….

మరోవైపు హిమాశ్రీ బోరో చదివిన గౌహతిలోని బి.బరూవా కాలేజీ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఘటనపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక డిమోరియా ఎమ్మెల్యే తపన్ దాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాన్ని విమానంలో గౌహతికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks