ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
స్విట్జర్లాండ్ వేదికగా మారుమోగిన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే.. గూస్ బంప్స్ కన్ఫామ్!
Brahma Okkate Parabrahma Okkate : తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సంగీతానికి భాషా భేదాలు, దేశాల సరిహద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన కీర్తన ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ ఇప్పుడు ఖండాంతరాలు దాటి విదేశీ గడ్డపై ప్రతిధ్వనించింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘సోల్స్బర్గ్ ఫెస్టివల్ 2026’ (Solsberg Festival 2026) వేదికపై గ్రామీ అవార్డు విజేత అయిన అమెరికాకు చెందిన ప్రముఖ అకాపెల్లా గాయక బృందం ‘చాంటిక్లియర్’ (Chanticleer) ఈ కీర్తనను అత్యద్భుతంగా ఆలపించింది.

వాయిద్యాల సహకారం లేకుండా కేవలం తమ గాత్ర మాధుర్యంతోనే ఆ బృందం చేసిన ఈ ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. 15వ శతాబ్దంలో అన్నమయ్య రచించిన ఈ ఐకానిక్ కీర్తనను అంతర్జాతీయ స్థాయి కళాకారులు అంతే భక్తిశ్రద్ధలతో, స్పష్టమైన ఉచ్చారణతో పాడటం ఎంతో హృద్యంగా ఉందని ఆయన కొనియాడారు.
'సమస్త జీవరాశుల సమానత్వం, మానవత్వం, ఏకత్వం అనే గొప్ప సందేశాన్ని ఈ కీర్తన ప్రపంచానికి చాటిచెబుతోంది. చాంటిక్లియర్ బృందం తమ గానంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల మనసులను గెలుచుకుంది. సరిహద్దులు, భాషలు, తరాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసే శక్తి మన తెలుగు సంస్కృతి, వారసత్వానికి ఉందనడానికి ఈ ప్రదర్శనే నిదర్శనం.' అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ వీడియోను తన 'ఎక్స్' ఖాతాలో షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. 'బ్రహ్మమొక్కటే.. పరమాత్మ ఒక్కడే! ఇది తెలుగు సంస్కృతికి ఎంతో గర్వకారణమైన క్షణం. స్విట్జర్లాండ్‌లోని సోల్స్బర్గ్ ఫెస్టివల్లో చాంటిక్లియర్ బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తన, మన ఘనమైన సంగీత వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలను ఎంతగా ఆకట్టుకుంటుందో అద్భుతంగా ఆవిష్కరించింది.' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎవరీ చాంటిక్లియర్? ఏమిటీ అకాపెల్లా ప్రత్యేకత?
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే చాంటిక్లియర్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పురుషుల గాయక బృందాలలో ఒకటి. దీనికి ‘ఆర్కెస్ట్రా ఆఫ్ వాయిసెస్’ అనే పేరు కూడా ఉంది. ఎలాంటి సంగీత వాయిద్యాలు ఉపయోగించకుండా, కేవలం మనుషుల గొంతుల ద్వారానే వివిధ రకాల శబ్దాలను, రాగాలను సృష్టించే ‘అకాపెల్లా’ శైలిలో వీరు దిట్టలు.
ఇప్పటికే పలుమార్లు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఈ బృందం, భారతీయ శాస్త్రీయ సంకీర్తనను ఇంతటి కచ్చితత్వంతో ఆలపించడం విశేషం. ముఖ్యంగా తెలుగు పదాలు ఎక్కడా తడబడకుండా, ఆ కీర్తనలోని ఆధ్యాత్మిక భావాన్ని పండిస్తూ వారు పాడిన తీరుకు స్విట్జర్లాండ్‌లోని ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
సుమారు 500 ఏళ్ల క్రితమే సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ, కులమతాలకు అతీతంగా భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని అన్నమాచార్యులు బ్రహ్మమొక్కటే కీర్తన ద్వారా చాటిచెప్పారు. "నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే.. అండనే బంటు నిద్ర అదియునొకటే" అంటూ రాజుకైనా, సామాన్యుడికైనా ప్రకృతి ధర్మాలు ఒక్కటేనని ఆనాడే ఆయన గొప్ప తత్వాన్ని బోధించారు. అలాంటి సందేశం కలిగిన తెలుగు కీర్తన నేడు యూరప్ గడ్డపై మార్మోగడం పట్ల తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

E-Paper
