OTT Thriller: ఓటీటీలో అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్- ఒక్క సినిమా, 6 వేర్వేరు కథలు- 50 అంతర్జాతీయ అవార్డులు- 8.1 రేటింగ్

Wild Tales OTT Streaming: ఓటీటీలో అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా వైల్డ్ లైఫ్ అదరగొడుతోంది. ఒక్క సినిమాలో 6 వేర్వేరు కథలతో ఆకట్టుకుంటోంది. 8.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన ఈ సినిమా 50 అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. అలాంటి వైల్డ్ టేల్స్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 29, 2026, 05:30:50 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Wild Tales OTT Release: వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు, ఇంటిల్లిపాదీ లేదా స్నేహితులతో కలిసి ఓటీటీలో కొత్త కంటెంట్ కోసం వెతుకుతుంటారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా, చూస్తున్నంత సేపు సీటు అంచున కూర్చోబెట్టే ఓ అద్భుతమైన సైకలాజికల్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

ఓటీటీలో అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్- ఒక్క సినిమా, 6 వేర్వేరు కథలు- 50 అంతర్జాతీయ అవార్డులు- 8.1 రేటింగ్
ఓటీటీలో అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్- ఒక్క సినిమా, 6 వేర్వేరు కథలు- 50 అంతర్జాతీయ అవార్డులు- 8.1 రేటింగ్

ఆస్కార్ నామినేషన్, 50 అంతర్జాతీయ అవార్డులు

ఆ సినిమా పేరే 'వైల్డ్ టేల్స్' (Wild Tales). 2014లో విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. 2 గంటల 1 నిమిషం నిడివి ఉన్న ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 8.1 రేటింగ్ ఉంది. అంతర్జాతీయ వేదికలపై ఏకంగా 50 అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం, ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి కూడా నామినేట్ అయింది.

సాధారణంగా స్పానిష్ భాషా చిత్రాలకు మన దగ్గర ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతీకారం, కోపం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తాయో ఈ సినిమాలోని ఆరు చిన్న కథలు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.

'వైల్డ్ టేల్స్'లోని ఆరు ఉత్కంఠభరిత కథలివే..

1. విమానంలో ప్రయాణికుల కథ:

సినిమాలోని మొదటి కథ ఒక విమానంలో మొదలవుతుంది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మాటల్లో పడినప్పుడు, వాళ్లిద్దరికీ 'పాస్టర్‌నాక్' అనే వ్యక్తి తెలుసని బయటపడుతుంది. ఆశ్చర్యకరంగా ఆ విమానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ వ్యక్తితో ఏదో ఒక సంబంధం ఉంటుంది. అయితే ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ మరెవరో కాదు, స్వయానా ఆ పాస్టర్‌నాక్ అని తెలిసినప్పుడు వచ్చే మలుపు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది.

2. హైవే రెస్టారెంట్:

రెండో కథ ఒక హైవే పక్కన ఉన్న రెస్టారెంట్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ పనిచేసే ఒక వెయిట్రెస్ తన ముందు కూర్చున్న కస్టమర్‌ను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అతను ఒక వడ్డీ వ్యాపారి (లోన్ షార్క్). అతని వేధింపుల వల్లే గతంలో ఆ వెయిట్రెస్ తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వడ్డీ వ్యాపారిపై పగ తీర్చుకునేందుకు రెస్టారెంట్ వంటమనిషి వేసే ప్రమాదకరమైన ప్లాన్ కథను ఊహించని మలుపు తిప్పుతుంది.

3. రోడ్ రేజ్:

హైవేపై కారు నడుపుతున్నప్పుడు పక్క వాహనదారుడు కావాలని ఇబ్బంది పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఇద్దరు డ్రైవర్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం, ఆ తర్వాత ప్రాణాలు తీసుకునే స్థాయికి ఎలా చేరిందో ఈ కథలో అత్యంత సహజంగా చూపించారు.

4. బొంబిటా (Bombita):

తన కూతురి పుట్టినరోజు కోసం కేక్ కొనడానికి కారు దిగిన ఓ ఇంజనీర్ కారును ట్రాఫిక్ సిబ్బంది టో (ఎత్తుకెళ్లడం) చేస్తారు. కారును విడిపించుకునే క్రమంలో అధికారులతో జరిగిన గొడవ వల్ల ఆ ఇంజనీర్ రాత్రికి రాత్రే వార్తల్లోకి ఎక్కుతాడు. ఈ వివాదంతో అతను జైలుకు వెళ్లడమే కాకుండా ఉద్యోగం కోల్పోతాడు, భార్య కూడా వదిలేసి వెళ్లిపోతుంది. కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్న సమయంలో మరోసారి అతని కారు టో అవ్వడంతో, ట్రాఫిక్ వ్యవస్థపై ఆ ఇంజనీర్ తీర్చుకున్న వినూత్న ప్రతీకారం అతన్ని నగరంలో హీరోను చేస్తుంది.

5. హిట్ అండ్ రన్:

సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ గర్భిణిని ఢీకొడతాడు. ఈ ప్రమాదంలో ఆ మహిళతో పాటు కడుపులోని బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోతారు. చట్టం నుంచి తన కొడుకును కాపాడుకోవడానికి ఆ తండ్రి చేసే ప్రయత్నాలు, మరోవైపు భార్యను కోల్పోయిన భర్త ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంచుకునే మార్గం ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి.

6. ది వెడ్డింగ్:

ఒక పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఈ చివరి కథ సాగుతుంది. తనకు ఇప్పుడే పెళ్లయిన వరుడికి, వేడుకకు వచ్చిన ఒక అతిథితో అక్రమ సంబంధం ఉందని వధువుకు తెలుస్తుంది. ఈ నిజం తెలిసి తట్టుకోలేని వధువు భవనం పైకప్పుపైకి పరుగెత్తుతుంది. ఆ తర్వాత పెళ్లి వేడుకలో జరిగే నాటకీయ పరిణామాలు నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

మనిషిలోని సహనం నశించినప్పుడు ఎదురయ్యే పరిణామాలను డార్క్ కామెడీ, థ్రిల్లర్ అంశాలతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ వీకెండ్‌లో బోర్ కొట్టకుండా, ఆద్యంతం ఆసక్తిగా సాగే సినిమా చూడాలనుకునే వారికి 'వైల్డ్ టేల్స్' కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వైల్డ్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సాయంతో ప్రైమ్ వీడియో‌లో వైల్డ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ అయింది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.