Investment Protection Act : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి రక్షణ చట్టం ఎందుకు అవసరం?
Investment Protection Act : ఇటీవల విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ఈ చట్టం ఎందుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారాలను స్థాపించే పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు త్వరలోనే ఒక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ చట్టం ఏమిటి? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూడండి.

ప్రభుత్వాలు మారినప్పుడు విధానాల కొనసాగింపుపై పెట్టుబడిదారులకు ఉన్న ఆందోళనలను తొలగించేందుకు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి ప్రయోజనాలను రక్షించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు.
ప్రభుత్వాలు మారినా
అధికారుల సమాచారం ప్రకారం ఈ చట్టం ద్వారా.. భూ కేటాయింపులు, భూమి, నీటి ధరలు, ఆర్థిక, ఇతర ప్రోత్సాహకాలు, అలాగే వాగ్దానం చేసిన మౌలిక సదుపాయాలకు సంబంధించి మునుపటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కొత్తగా వచ్చే ప్రభుత్వాలు కూడా గౌరవించేలా బాధ్యత కల్పిస్తుంది. అంతేకాకుండా ఒకసారి మంజూరైన అనుమతులు లేదా ఆమోదాలను, తదుపరి వచ్చే ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలతో మార్చడానికి వీలుండదు. యథావిధిగా కొనసాగించాల్సి ఉంటుంది. చట్టంలో చెప్పిన విధంగా ఉన్న విషయాలను పాటించాలి.
ఈ చట్టం ఎందుకు అవసరం?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేరుగా ఉంటుంది. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తెలుగు దేశం పార్టీని ఓడించినప్పుడు, అమరావతి రాజధాని ప్రాజెక్టుతో సహా మునుపటి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను రద్దు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, మౌలిక సదుపాయాల కాంట్రాక్టులను రద్దు చేయడమే కాకుండా, అప్పటికే ప్రకటించిన ప్రోత్సాహకాలను కూడా చెల్లించలేదు. ఇది రాష్ట్రంలోని పెట్టుబడి వాతావరణాన్ని దెబ్బతీసింది.
పెట్టుబడిదారుల భయం పోయేందుకు
2024లో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడంతో పెట్టుబడిదారులు మళ్లీ రాష్ట్రం వైపు మొగ్గు చూపినప్పటికీ, విధానాల కొనసాగింపుపై భయం ఇంకా అలాగే ఉందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న బలహీనమైన చట్టాలపై ఆధారపడకుండా, పరిశ్రమల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే ఒక పటిష్టమైన చట్టం అవసరమని భావించారు చంద్రబాబు.
రూ.32.5 లక్షల కోట్ల పెట్టుబడులు
గత రెండేళ్లుగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలతో పెట్టుబడులకు గమ్యస్థానాంగా ఏపీ నిలిచింది. 2024 జూన్ నుండి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.22.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇటీవల జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో మరో రూ.9.98 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ లభించింది. దీంతో మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీని ద్వారా 25 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది.
కొత్త చట్టం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ తదుపరి సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత చట్టాన్ని మరింత మెరుగుపరచడానికి, అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడతారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ఈ చట్టం అమల్లోకి వస్తే, పెట్టుబడిదారుల రక్షణకు చట్టపరమైన భద్రత లభిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ విధానాల కొనసాగింపు విషయంలో పెట్టుబడిదారులకు ఉండే ఆందోళనలన్నీ దీనివల్ల తొలగిపోతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
జాతీయ స్థాయిలో చట్టం!
సీఎం చంద్రబాబు అభిప్రాయం ప్రకారం, జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడిదారుల రక్షణ చట్టం ఉండటం వల్ల ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా భారత్ స్థానం మరింత బలపడుతుంది. ఇటువంటి చట్టం దేశంలోకి విదేశీ పెట్టుబడులు భారీగా రావడానికి దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. దీనికి మరో కారణం కూడా ఉంది. రాష్ట్ర స్థాయిలో చేసిన చట్టాన్ని తదుపరి ప్రభుత్వం శాసనసభలో మరో చట్టాన్ని ఆమోదింపజేసి, రాష్ట్రపతి అనుమతి పొందడం ద్వారా రద్దు చేసే అవకాశం ఉంటుంది. అదే కేంద్ర చట్టం అయితే అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, తమకు ఎంత భారీ మెజారిటీ ఉన్నప్పటికీ, ఆ చట్టాన్ని రద్దు చేయలేదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


