అమరావతి, నాగార్జునసాగర్, నెల్లూరు, కుప్పం, శ్రీకాకుళంలో కొత్త ఎయిర్‌పోర్టులు : కేంద్రమంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని కొత్త ఎయిర్‌పోర్టులు ప్లాన్ చేస్తున్నట్టుగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇప్పటికే కుప్పం, శ్రీకాకుళం వాటికి సైట్ క్లియేరెన్స్ అయినట్టుగా వెల్లడించారు.
గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నంలోని ఐఐఎమ్ (IIM Visakhapatnam) వేదికగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన రీజినల్ సమిట్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు-పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సదస్సును ఉద్దేశించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం దేశం 7.8 శాతం జిడిపి (GDP) వృద్ధి రేటుతో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలో ఆర్థిక పురోగతి వేగవంతమైందన్నారు.
'సమయమే అత్యంత విలువైన పెట్టుబడి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను ఎలాంటి లంచగొండితనం, ఆటంకాలు లేకుండా 6 నుండి 12 నెలల వ్యవధిలోనే ఇచ్చేలా ఏపీఐఐసీ(APIIC) సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పారదర్శకమైన విధానం అమల్లోకి తెచ్చాం' అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
పరిశ్రమల ఏర్పాటులో ఉండే అధికారిక ఆలస్యా్న్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రులు నొక్కి చెప్పారు. పరిశ్రమల ఆలోచన డ్రాయింగ్ బోర్డు నుండి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ప్రణాళికలు అత్యంత వేగంగా అమలయ్యేలా నూతన పారిశ్రామిక విధానాలు రూపొందించామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన అపూర్వమైన రీతిలో జరుగుతోందని రామ్మోహన్ నాయుడు వివరించారు.అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) నిర్మాణం నిర్ణీత గడువు కంటే 6 నెలల ముందే, కేవలం 31 నెలల వ్యవధిలోనే పూర్తి అయిందన్నారు.
కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు అవసరమైన సైట్ క్లియరెన్సులు పూర్తయ్యాయాని చెప్పారు. అమరావతి, నాగర్జునసాగర్, నెల్లూరులో కొత్త ఎయిర్‌పోర్టులు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించారు. పుట్టపర్తిలో ఏరోస్పేస్ హబ్ నిర్మాణ ప్రణాళికలు ఉన్నాయన్నారు. ఏవియేషన్ రంగంలో దాదాపు 5,000 మందికి పైగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నైపుణ్యం కలిగిన నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రవాణా రంగ సమగ్ర స్వరూపాన్ని రాష్ట్ర మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి సదస్సులో వివరించారు. లాజిస్టిక్స్ పనితీరుపై వెలువడిన లీడ్స్-2025 నివేదికలో ఆంధ్రప్రదేశ్ యాక్సిలరేటర్ హోదాను సొంతం చేసుకుందన్నారు. రాష్ట్రంలో 1.6 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘమైన రోడ్డు నెట్‌వర్క్ ఉనప్పటికీ, ప్రస్తుతం మరో రూ.1 లక్ష కోట్లకు పైగా విలువైన రోడ్డు, రవాణా ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు.
రూ.31,000 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లభించాయన్నారు. సముద్ర వాణిజ్యాన్ని సరికొత్త మలుపు తిప్పేలా మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులను మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
పారిశ్రామిక ప్రదర్శనలో భాగంగా సదస్సు ప్రాంగణంలో 25 ప్రాంతీయ పరిశ్రమలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్స్, మెటలర్జీ, హెల్త్ టెక్ పరిశ్రమలతో పాటు ఆంధ్రప్రదేశ్ విశిష్టతను చాటే అరకు కాఫీ, పొందురు ఖాదీ, మాడుగుల హల్వా వంటి సాంప్రదాయ ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


