Amaravati Outer Ring Road : అమరావతి ORRకు టెండర్ల - నాలుగు ప్యాకేజీలుగా విభజన! కృష్ణా నదిపై భారీ వంతెన
Amaravati Outer Ring Road : రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న ఓఆర్‌ఆర్ నిర్మాణ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు ఆహ్వానించింది.
Amaravati Outer Ring Road : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత కీలకమైన మైలురాయి పడింది. రాజధాని నగరం చుట్టూ సుమారు 190 కిలోమీటర్ల పొడవున నిర్మించ తలపెట్టిన బృహత్తర 6 వరుసల ఎక్స్‌ప్రెస్‌వే 'ఔటర్ రింగ్ రోడ్డు (ORR)' పనులను వేగవంతం చేసేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) పూర్తిస్థాయి ముసాయిదాను సిద్ధం చేసింది. అంతేకాకుండా దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు ఆహ్వానించింది.

గుంటూరు సమీపంలోని 5.2 కిలోమీటర్ల స్పర్ రోడ్డుతో కలిపి ఈ మెగా ప్రాజెక్టు మొత్తం నిర్మాణ పొడవు 195.13 కిలోమీటర్లుగా ఉండనుంది. పనులను వేగంగా పూర్తి చేయడానికి వీలుగా ఈ ప్రాజెక్టును మొత్తం నాలుగు వేర్వేరు ప్యాకేజీలుగా వర్గీకరించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అమరావతి ఓఆర్ఆర్ సివిల్ నిర్మాణ పనుల వ్యయాన్ని రూ. 10,596 కోట్లుగా ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే భూసేకరణ, పరిహారం చెల్లింపులు, ఇతర సాంకేతిక భాగాలను కలుపుకుని ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 30,491 కోట్లకు చేరుతుందని అధికారులు వెల్లడించారు.
రాజధాని ప్రాంతంలో అత్యధిక సామర్థ్యం కలిగిన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రాజధాని మీదుగా వెళ్లే ప్రధాన జాతీయ రహదారులను, అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలను ఇది నేరుగా అనుసంధానిస్తుంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు మీదుగా ప్రయాణించే భారీ సరుకు రవాణా వాహనాలను రాజధాని వెలుపలి నుంచే మళ్లించేందుకు ఈ రహదారి ఎంతగానో దోహదపడుతుంది.
4 ప్యాకేజీలు - వివరాలు
- ప్యాకేజీ 1 : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద ఇది ప్రారంభమవుతుంది. 27 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ మార్గం కొండపల్లి, పంగిడి అటవీ ప్రాంతాల గుండా సాగి మైలవరం వద్ద ముగుస్తుంది. ఈ అటవీ ప్రాంతంలో ప్రయాణానికి వీలుగా 2.7 కిలోమీటర్లు, 1.6 కిలోమీటర్ల నిడివితో రెండు భారీ టన్నెళ్లు (సొరంగాలు) నిర్మించనున్నారు. అంతేకాకుండా 189 కి.మీ నుంచి 189.93 కి.మీ పాయింట్ల మధ్య మరో 930 మీటర్ల రహదారిని కూడా ఈ ప్యాకేజీలోనే చేర్చారు.
- ప్యాకేజీ 2 : ఇది 27వ కిలోమీటర్ పాయింట్ నుండి ప్రారంభమై కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కొలవెన్ను సమీపంలోని 83వ కిలోమీటర్ పాయింట్ వరకు మొత్తం 56 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది.
- ప్యాకేజీ 3 : కంకిపాడు మండలం కొలవెన్ను వద్ద (83వ కిమీ) ప్రారంభమై గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లాడిగుంట వరకు 50.5 కిలోమీటర్ల పొడవునా సాగుతుంది. ఈ ప్యాకేజీలోనే నారాకోడూరు-బుడంపాడు మధ్య 5.2 కిలోమీటర్ల స్పర్ రోడ్డును నిర్మిస్తారు. అంతేకాకుండా, వల్లూరిపాలెం సమీపంలో కృష్ణా నదిపై 4.8 కిలోమీటర్ల మేర అత్యంత పొడవైన వంతెనను ఈ విభాగాంలోనే నిర్మించనున్నారు.
- ప్యాకేజీ 4 : చివరిదైన ఈ భాగం 133.5 కిలోమీటర్ల పాయింట్ నుండి కంచికచర్ల సమీపంలోని 189వ కిలోమీటర్ పాయింట్ వరకు 55.5 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఈ మార్గంలో వీరుళ్లపాడు వద్ద 400 మీటర్ల పొడవైన మరో టన్నెల్‌ను నిర్మిస్తారు. దీంతో పాటు మున్నలూరు వద్ద కృష్ణా నదిపై సుమారు 3.15 కిలోమీటర్ల పొడవైన రెండో ప్రధాన వారధి నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
ఈ విధంగా ప్యాకేజీ 1 లో రెండు, ప్యాకేజీ 4 లో ఒకటి చొప్పున ఈ ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో మొత్తం మూడు ఆధునిక టన్నెళ్లు రానున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రవాణా రంగం సరికొత్త పుంతలు తొక్కుతుంది. స్థానిక ప్రయాణికులకు, సుదూర ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలకు వేర్వేరు మార్గాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కృష్ణా నదిపై నిర్మించే రెండు బృహత్తర వారధులు, కొండల గుండా తొలిచే మూడు సొరంగాలు, అనేక జాతీయ రహదారుల అనుసంధానంతో ఈ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ రాజధాని అమరావతి వికాసానికి ఆర్థిక చోదక శక్తిగా మారనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

