'తుపానుతో రాష్ట్రానికి రూ.6,384 కోట్ల నష్టం... ఉదారంగా ఆదుకోండి' - కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు

మొంథా తుపానుతో రాష్ట్రానికి రూ.6,384 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. త్వరితగతిన నివేదిక ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని కోరారు. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలని కోరారు.

Published on: Nov 12, 2025 5:15 AM IST
PTI | By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తుపాను కారణంగా ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత రంగాలు దెబ్బతిన్నాయని అన్ని రంగాల్లో మొత్తంగా రూ.6384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందానికి వివరించారు.

కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు
కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు

తుపాను నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం సమావేశమైంది. క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనల్ని సీఎం దృష్టికి తీసుకువచ్చింది. రెండు బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేశామని వివరించింది.

కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించనట్టు తెలిపింది. మొంథా తుపాను, భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మొంథా తుపాను కారణంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం నివేదికలో పేర్కోంది.

దాదాపు 10 లక్షల మంది తుపానుతో పాటు భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 9,960 ఇళ్లు నీట మునిగాయని 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం పేర్కోంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 4,566 ఇళ్లు దెబ్బతిన్నట్టు వివరించింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని.. 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారని కేంద్ర బృందానికి నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించింది.

తక్షణ సాయం అందంచండి - సీఎం విజ్ఞప్తి

4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేల కూలినట్టు తెలిపింది. అలాగే 2,318 విద్యుత్ ట్రాన్సఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొంది. మొంథా తుపాను వల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని ప్రభుత్వం వెల్లడించింది.

మొత్తం 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున తక్షణ ఆర్ధిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి వివరించింది. రాష్ట్రంలో రహదారులు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను తక్షణం పునరుద్ధరించేందుకు తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది.

త్వరితగతిన సాయం వచ్చేలా చూడండి - సీఎం

రాష్ట్రంలో జరిగిన తుపాను నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినందున త్వరితగతిన నివేదిక ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం.. కేంద్ర బృందాన్ని కోరారు. ఏపీ నుంచి రెండు రోజుల్లో తుది అంచనాలను కూడా పంపుతామని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర బృందం.. త్వరితగతిన కేంద్రానికి సిఫార్సులు చేస్తామని వెల్లడించింది.

తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలు సవరించేలా సిఫార్సు చేయాలని సీఎం కోరారు. పత్తి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తూర్పు కోస్తాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడూ తుపాన్ల కారణంగా నష్టం జరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు… కేంద్ర బృందానికి తెలిపారు. సూళ్లూరు పేట నుంచి ఇఛ్చాపురం వరకూ ఉన్న ప్రాంతాలు తుపాన్ల కారణంగా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని వివరించారు. తుపాన్ల గమనాన్ని గమనించేలా సాంకేతికత వినియోగిస్తున్నా దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ఆస్కారం లేదని.. ఫలితంగా ఆస్తి నష్టం జరుగుతోందని అన్నారు. అవేర్ తో పాటు ఇతర సాంకేతిక వ్యవస్థల ద్వారా వరద నియంత్రణను చేయగలుగుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

తీరప్రాంతాల్లోని సముద్ర కోత నివారణకు వేర్వేరు చోట్ల పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. కోస్టల్ సీ ఎరోజన్ మిటిగేషన్ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద సముద్రపు కోత నివారణ కోసం చేపట్టే పనులకు రూ.323 కోట్లు, విశాఖ సమీపంలో రూ.203 కోట్లు, శ్రీకాకుళం సమీపంలో రూ.98 కోట్లు నిధులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.

News/Andhra Pradesh/'తుపానుతో రాష్ట్రానికి రూ.6,384 కోట్ల నష్టం... ఉదారంగా ఆదుకోండి' - కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు
News/Andhra Pradesh/'తుపానుతో రాష్ట్రానికి రూ.6,384 కోట్ల నష్టం... ఉదారంగా ఆదుకోండి' - కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు