ఒకేరోజు 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ - కుప్పానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు
కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లు పంపిణీ చేశారు. ఒకేరోజులో 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి కుప్పం నియోజకవర్గం గిన్నిస్ రికార్డు సాధించింది.
పర్యావరణ పరిరక్షణ- సాధికారత లక్ష్యంగా మహిళలకు ఇ-సైకిళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో 5555 సైకిళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసి కుప్పం నియోజకవర్గం… గిన్నీస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది. ఇ-సైకిళ్లను ఇంత పెద్ద సంఖ్యలో పంపిణీ చేయటంపై ఈ రికార్డు నమోదు అయినట్టు గిన్నీస్ వరల్డ్ బుక్ అజుడికేటర్ ప్రకటించారు.

సూపర్ సైకిల్ గా పేరు…
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సైకిళ్ల తయారీ సంస్థ ఇ-మోటరాడ్ ప్రతినిధులకు శనివారం సర్టిఫికెట్ అందించారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఇ-సైకిళ్లను పంపిణీ చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇ- సైకిళ్లకు ‘సూపర్ సైకిల్’ అని పేరుపెట్టినట్టు సీఎం వివరించారు. 60 కిలోమీటర్ల వరకూ సైకిల్ పైనే ప్రయాణించి పనులు చేసుకోవచ్చని సీఎం తెలిపారు.
వీటి ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గించేలా చూస్తున్నామని అన్నారు. ఇ-సైకిళ్ల వినియోగం ద్వారా ప్రతీ కుటుంబం రూ.1000 నుంచి 1500 వరకూ ఆదా చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్కూటర్ ద్వారా ప్రతీ కిలోమీటరు ప్రయాణానికి 68 గ్రాముల మేర కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై కలుషితం అవుతుందని.. ఇ-సైకిల్ ద్వారా కేవలం 15 గ్రాములు మాత్రమే పరోక్షంగా వస్తుందని తద్వారా 75 శాతం ఉద్గారాలు తగ్గుతాయన్నారు.
ప్రతీ వెయ్యి ఇ- సైకిళ్ల ద్వారా ఏడాదికి 37 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ తగ్గుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సైకిల్ అంటే పురోగతికి చిహ్నమని.. ఇ-సైకిల్ ఈ తరానికి సింబల్ గా నిలుస్తుందని వివరించారు. కడుపల్లెలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి ఇ- సైకిళ్లపై ర్యాలీగా ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర హుషారుగా సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
పెన్షన్లు అందజేత…
కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బెగ్గిలపల్లెలో ముగ్గురు లబ్దిదారుల నివాసాలకు వెళ్లిన సీఎం మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్న తాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకట రామప్ప అనే లబ్ధిదారుకు వృద్ధాప్య పింఛను అందించారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
రూ. 2730 కోట్ల మేర పెన్షన్ల రూపంలో లబ్దిదారులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పొరుగున తమిళనాడులో నెలకు రూ. 315 కోట్లు, కర్ణాటకలో రూ. 392 కోట్లు పెన్షన్లు నిమిత్తం ఖర్చు చేస్తున్నారని సీఎం అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీలో పేదలకు ఏ స్థాయిలో పెన్షన్ అందచేస్తున్నామనేది గుర్తించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పం నియోజకవర్గమే ఓ ప్రయోగశాల అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.కుప్పంలో పైలట్ గా ప్రారంభించి విజయవంతమైన డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు సంజీవనిని ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం అన్నారు. మెరుగైన వైద్యాన్ని సేలవను ప్రజల ఇంటి వద్దకే అందుబాటులోకి తెచ్చేలా ఈ సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. ఫోన్ల ద్వారా వైద్యుల అప్పాయింట్మెంట్లు, నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు.
హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి రైతులకు నీళ్లు అందించామని సీఎం అన్నారు. నియోజకవర్గంలో వర్షపు నీటిని కూడా సద్వినియోగం చేసుకునేలా లింక్ కెనాల్స్, చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. కుప్పంలోని యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రూ. 7088 కోట్ల పెట్టుబడులతో 16 పరిశ్రమలు వచ్చాయని వీటి ద్వారా 34 వేల పైచిలుకు మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభించేలా చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

