'ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు కుప్పం ఎయిర్‌పోర్ట్.. రైతులకు న్యాయమైన పరిహారం'

చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు కోసం పనులు వేగవంతం అవుతున్నాయి. భూసేకరణపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ఫోకస్ చేశారు. రైతులకు సరైన పరిహారం అందుతుందని హామీ ఇస్తున్నారు.

Published on: Jan 1, 2026, 12:23:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంచేలా కుప్పం ఎయిర్ పోర్ట్ ఉంటుందని చెప్పారు. శాంతిపురం మండలం దండికుప్పం గ్రామంలో రైతులతో గ్రామసభలో ఆయన మాట్లాడారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కుప్పం నియోజకవర్గంలో ప్రతిపాదిత విమానాశ్రయానికి భూమిని అందించడానికి శాంతిపురం, రామకుప్పం మండలాల చాలా మంది రైతులు ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చారని కలెక్టర్ సుమిత్ పేర్కొన్నారు. వారికి న్యాయమైన పరిహారం, ఇళ్ళు, భూములు, పశువుల రక్షణతో సహా పూర్తి మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. భూమిని కోల్పోయే రైతులకు అర్హత ఉన్న అన్ని ప్రయోజనాలు అందేలా చూడటానికి ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించనున్నారు.

పలమనేరు, వి.కోట, మదనపల్లె ప్రాంతాల రైతులు చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ విమానాశ్రయం సహాయపడుతుందని, దీని వలన మంచి ధరలు, మెరుగైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ సుమిత్ అన్నారు. ప్రాంతీయ వాణిజ్యం పెరుగుతుందని చెప్పారు. భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ జరుగుతుందని, ఈ ప్రాజెక్ట్ దాదాపు 500 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తుందని భావిస్తున్నారు.

2027 నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కలెక్టర్ సుమిత్ అన్నారు. బెంగళూరుకు సమీపంలో ఉండటం వల్ల ఈ విమానాశ్రయం కుప్పం, సమీప ప్రాంతాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తెస్తుందని నమ్ముతున్నారు.

విమానాశ్రయానికి భూమి ఇవ్వడానికి ముందుకు రావాలని, నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్. ఈ మేరకు శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని రైతులను కోరారు. ఈ ప్రాజెక్ట్ కుప్పం, పరిసర ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు.

అందుబాటులోకి భోగాపురం ఎయిర్‌పోర్ట్

విజయనగరం భోగాపురం ఎయిర్‌పోర్ట్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో ఏపీలో మరో ఎయిర్ పోర్టు నుంచి ప్రజలు రాకపోకలు సాగించవచ్చు. ఎయిర్ పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. 95 శాతం పనులు పూర్తవ్వగా.. 5 శాతం పనులు కావాల్సి ఉంది. మిగిలిన 5 శాతం పనులను జూన్ వరకు పూర్తి చేసి.. ఆగస్టు నుంచి ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. జనవరి 4వ తేదీన టెస్ట్ ఫ్లైట్ ఎగరనుంది. తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలుసాగించడానికి అనుకూలంగా అన్ని విమానయాన సంస్థలతో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చలు జరపనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More