...
...
Next Story

Markapuram Bus Accident : బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి - విచారణకు ఆదేశాలు

మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిన ఘటన 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Published on: Mar 26, 2026 09:54 AM IST
Advertisement

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ - ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

విచారణకు ఆదేశించిన సీఎం

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

బాధితులకు అండగా ఉంటాం - మంత్రి లోకేశ్

రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. “బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని తెలిపారు.

వైఎస్ జగన్ దిగ్భ్రాంతి…

మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని… ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వైయస్‌ జగన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

చర్యలు తీసుకోండి - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నిర్మల్ నుంచి బయలుదేరి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు…. ఆంధ్రప్రదేశ్ సీఎస్ తో మాట్లాడారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe