AP Transport Department : రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు

రాష్ట్ర రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. డీమ్డ్ రిజిస్ట్రేషన్, ఆటోమేటెడ్ ట్రాక్స్ ద్వారా పారదర్శక సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Published on: Aug 4, 2026, 06:02:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Transport Department Reforms : రవాణా శాఖ సేవలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా శాఖలోని అనవసర నిబంధనలను తక్షణమే తొలగించాలని, ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతిలో సోమవారం రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో శాఖలో చేపడుతున్న సంస్కరణలు, సాంకేతికత వినియోగంపై ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సమావేశంలో రవాణా శాఖలో పూర్తిస్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, అవినీతిని అరికట్టడం, సేవలను సులభతరం చేయడంపై అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎంకు వివరించారు.

కార్యాచరణ సిద్ధం….

ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే క్రమంలో 24 గంటల్లోనే డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు మానవ ప్రమేయాన్ని తగ్గించి, అక్రమాలకు తావులేకుండా చేసేందుకు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఉన్న క్లిష్టమైన ఫారం-5B వంటి పరీక్షలను పూర్తిగా తొలగించడం ద్వారా వాహనదారులపై అనవసర భారం తగ్గుతుందని…. అవినీతికి అడ్డుకట్ట పడుతుందని వివరించారు. ఈ సంస్కరణలన్నింటినీ దశలవారీగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

అనవసర నిబంధనలు తొలగించండి - సీఎం చంద్రబాబు

మనుషుల ప్రమేయం ఎంత తగ్గితే అవినీతి అంత తగ్గుతుందని నమ్మే ప్రభుత్వం తమదని, అందుకే రవాణా శాఖలో వీలైనంత వరకు అనవసర నిబంధనలను, నిబంధనల పేరుతో పెట్టే ఇబ్బందులను తొలగించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిజిటల్ విధానాల ద్వారా సేవలందించినప్పుడే వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందన్నారు.

ఎల్ నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టిపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను, రిజర్వాయర్లలో, నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ఎగువన వర్షాలు కురుస్తున్నందున్న కృష్ణా బేసిన్ లో నీటి లభ్యత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని అధికారులు వివరించారు. కృష్ణానదిలో కొద్ది రోజులుగా ప్రవాహాలు మొదలైనట్లు వివరించారు. అలాగే గోదావరిలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాభావం వల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని...దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరుచూ తాగునీటి పరీక్షలు జరపాలని... ల్యాబ్ టెస్టుల నివేదికలను విడుదల చేయాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి... అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More