అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ - స్మృతివనంపై సీఎం చంద్రబాబు ప్రకటన

అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు… వాజ్ పేయ్, ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. దేశ మౌలిక సదుపాయాలకు వాజ్‌పేయీ బలమైన పునాది వేశారని గుర్తు చేశారు.

Published on: Dec 25, 2025, 17:04:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురువారం వెంకటపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

అమరావతిలో వాజ్ పేయి విగ్రహావిష్కరణ
అమరావతిలో వాజ్ పేయి విగ్రహావిష్కరణ

ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచం అంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దటమే తమ ధ్యేయమన్నారు. స్పూర్తిదాత వాజ్ పేయి స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్పూర్తి అని చెప్పుకొచ్చారు.

స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం - సీఎం చంద్రబాబు

“చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నాం. అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర బీజేపీ ప్రారంభించింది. 26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్టించేలా కూటమి సంయుక్తంగా పనిచేసింది. అమరావతిలో వాజ్ పేయి విగ్రహంతో పాటు ఆయన చరిత్ర, సుపరిపాలనను ప్రజలకు తెలిసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం” అని సీఎం చంద్రబాబు వివరించారు.

నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రేసతర పార్టీలను ఏకం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. “వాజ్ పేయి ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన ప్రయాణం కూడా అత్యంత కీలకం. మంచి వక్త, కవిగా, ప్రజాహృదయ నేతగా అటల్ బిహారీ వాజ్ పేయి దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశారు. వాజ్ పేయి ప్రతిపాదించిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొట్టమొదట తడ -చెన్నైల మధ్యే ప్రారంభించాం. నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక టెలికామ్ సెక్టార్ ను డీరెగ్యులేషన్ ప్రారంభించి ప్రగతికి పునాది వేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4జీ రివల్యూషన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు” అని ప్రసంగించారు.

“దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి అప్పటి ప్రధాని వాజ్ పేయి. అప్పటి కార్గిల్ యుద్ధంలో వాజ్ పేయి, ఇప్పుడు సింధూర్ లో ప్రధాని మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని చాటారు.దేశం మెచ్చిన నేతగా మాజీ ప్రధాని వాజ్ పేయి చిరస్మరణీయులు. అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎన్టీఆర్ లాంటి నేతల్ని కూడా గుర్తుంచుకునేలా అమరావతిలో స్మారకాన్ని ఏర్పాటు చేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

అమరావతిలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు మరోసారి చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. “గేరు మార్చి పనుల్ని వేగవంతం చేస్తాం.నాడు ప్రధాని హోదాలో హైటెక్ సిటీకి అటల్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటం జోరు. హైవేలు, పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. గత పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. ఇప్పుడు కోలుకుని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టింది” అని చెప్పుకొచ్చారు.

“పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలడ్డుతున్నారు.మెరుగ్గా ప్రాజెక్టు నిర్మితం కావాలంటే పీపీపీ ద్వారానే వేగంగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా ఇదే నిరూపితం అయింది.పీపీపీ పద్దతిలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఆర్ధిక మద్దతు కూడా ఇస్తున్నాం. పీపీపీ అంటే ప్రైవేటు కాదు ప్రభుత్వ ఆస్తే. దానిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తారు.కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు... అలాంటి వ్యక్తుల నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.వాజ్ పేయి లాంటి ఉన్నత నాయకులతో రాజకీయం చేసి.. ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయటం సిగ్గు అనిపిస్తోంది.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ అభివృద్ది యాత్ర అగదు. సంపద ఆరోగ్యం, ఆనందం ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More