...
...
Next Story

Amaravati Seed Access Road : రాజధానిలో మరో 2 కీలక ప్రాజెక్టులు రెడీ - ఈనెల 13న 'సీడ్ యాక్సెస్ రోడ్డు' ప్రారంభం, విశేషాలు

Amaravati Seed Access Road: ఈ నెల 13న అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

Published on: Aug 10, 2026, 12:11:19 IST
Advertisement

Amaravati Seed Access Road : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలకమైన మైలురాయి ఆవిష్కృతమవుతోంది. ఈ నెల 13వ తేదీన సీఎం చేతుల మీదుగా…. రాజధాని ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (సబ్ ఆర్టీరియల్ E3 రోడ్డు)తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), ఏపీ సీఆర్‌డీఏ మరియు గుంటూరు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేశాయి.

సిద్ధమవుతున్న ఏర్పాట్లు…

సీడ్ యాక్సెస్ రోడ్డు
సీడ్ యాక్సెస్ రోడ్డు

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైన నేపథ్యంలో సోమవారం అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, గుంటూరు జిల్లా పాలనా సిబ్బందితో కలిసి వారు స్టీల్ బ్రిడ్జి ప్రాంతాన్ని, సభా వేదిక వద్ద జరుగుతున్న పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

బకింగ్‌హామ్ కెనాల్ వద్ద చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనులు, గుంటూరు ఛానెల్, కొండవీటివాగులపై జరుగుతున్న తుది నిర్మాణ పనులను సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పనులన్నీ నిర్దేశిత సమయానికి పూర్తి చేసి సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కీలకంగా 'సీడ్ యాక్సెస్ రోడ్డు' - విశేషాలు

అమరావతి రాజధాని నగరంలో 'E3 రోడ్డు'గా పిలిచే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంతో కీలకమైన ప్రాజెక్టు. రాజధానిలోని N1 నుంచి N17 వరకు ఉన్న అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానిస్తూ మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవునా ఈ రహదారి విస్తరించి ఉంది. దొండపాడు గ్రామం వద్ద ప్రారంభమయ్యే ఈ రహదారి రాయపూడి, వేంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా సాగుతూ మణిపాల్ హాస్పిటల్స్ వద్ద జాతీయ రహదారి (NH-16)లో కలుస్తుంది. 60 మీటర్ల వెడల్పుతో నిర్మితమవుతున్న ఈ రహదారిని మూడు దశల్లో అభివృద్ధి చేశారు.

  • E3 ఫేజ్-1: 14.35 కిలోమీటర్లు
  • E3 ఫేజ్-2: 3.92 కిలోమీటర్లు
  • E3 ఫేజ్-3: 3.50 కిలోమీటర్లు
  • మొత్తం రహదారి పొడవు: 21.77 కిలోమీటర్లు

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భంలో మంచినీటి సరఫరా పైప్‌లైన్లు, గ్యాస్ నెట్‌వర్క్, విద్యుత్ లైన్లు, సీవరేజ్ వ్యవస్థ, ఐసిటి కేబుళ్లను అమర్చారు. ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు, కాలినడక బాటలు, గ్రీనరీ బెల్ట్‌లను సైతం ఏర్పాటు చేశారు.

రాజధాని నగరానికి విజయవాడ వైపు నుంచి తక్షణ అనుసంధానం కల్పించడంలో భాగంగా ఫేజ్-3లో భారీ నిర్మితులను చేపడుతున్నారు. ఓల్డ్ విజయవాడ -మంగళగిరి హైవేకి అనుసంధానిస్తూ 280 మీటర్ల పొడవైన మేజర్ స్టీల్ బ్రిడ్జి, 360 మీటర్ల 4-లైన్ రోడ్డు, బకింగ్‌హామ్ కెనాల్‌పై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ ఫేజ్-3 త్వరలోనే 6-లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌గా మారి నేరుగా జాతీయ రహదారి-16 (NH-16)కి అనుసంధానమవుతుంది.

మొత్తం 320.54 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటివరకు 278.93 ఎకరాలను సేకరించి పనులను పూర్తి చేశారు. ఈ ముఖ్యమైన రహదారి, ప్రజాప్రతినిధుల భవనాలు ప్రారంభం కానుండటంతో రాజధాని అమరావతికి మరింత కొత్త శోభ చేకూరనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe