నా గడ్డం మీదే సీఎం రేవంత్ రెడ్డికి ఫికర్ పట్టుకుంది : కేటీఆర్ కామెంట్స్
రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో కరువు కనిపించడం లేదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు. రైతుల కష్టాలపై స్పందించని సీఎం.. కేటీఆర్ గడ్డం మీదే రేవంత్‌కు ఫికర్ పట్టుకుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టి, అభివృద్ధి, సంక్షేమ సారథి కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో నెలకొన్న కరువు కనిపించడం లేదని విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే గ్రామాల్లో నాటకాలు వేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. రైతు జీవితం కంటే రాజకీయ ప్రయోజనమే రేవంత్ రెడ్డికి ముఖ్యమా? రైతులకు ధైర్యం చెప్పడం చేతకాదు కానీ, కేటీఆర్ గడ్డం మీద మాత్రం రేవంత్ రెడ్డికి ఫికర్ పట్టుకుందన్నారు. నిర్మల్ రైతు గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.

గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కూలీకి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 36 నెలలకు గాను మొత్తం రూ.36 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్నదాతలకు వెంటనే నాలుగు విడతల రైతుబంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు నేపథ్యంలో రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను వెంటనే రీషెడ్యూల్ చేయాలని, ఇంకా మిగిలిపోయిన రైతు రుణమాఫీని కూడా తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇస్తానని చెప్పడం లేదని, కరెంట్ ఇస్తానని భరోసా ఇవ్వడం లేదని, కనీసం ధైర్యం కూడా చెప్పడం లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి నుంచి ధైర్యం చెబుతారేమో, ఆర్థిక సహాయం అందిస్తారేమోనని రైతులు ఎదురుచూస్తుంటే, ఆయనకు అవేవీ పట్టడం లేదని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కూడా కనిపించడం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో ఓట్లు కావాలి, తెలంగాణలో సీట్లు కావాలి.. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే సోయి లేదని కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మనసులో తెలంగాణకు చోటు లేదా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. మూడేళ్లలో బీజేపీ వల్ల తెలంగాణకు ఒక్క పనైనా జరిగిందా? బీజేపీ ఎంపీని, బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే నిర్మల్ జిల్లాకు ఏమైనా మంచి జరిగిందా?
'ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేస్తుంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడటం లేదు. నిర్మల్ జిల్లాకు రావాల్సిన నవోదయ విద్యాలయం కూడా రాలేదు. ఓట్లు తొలగిస్తున్నారని దేశమంతా గగ్గోలు పెడుతుంటే, నిర్మల్‌లో మాత్రం ఎన్నికల సంఘానికి మద్దతుగా బీజేపీ ర్యాలీ తీస్తోంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు కరువు బృందాలు వెళ్తున్నాయి. కానీ తెలంగాణలో నెలకొన్న కరువు బీజేపీకి కనిపించడం లేదు. ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకు.' అని కేటీఆర్ ప్రశ్నించారు.
మూడేళ్లలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ రెడ్డి.. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ డబ్బులన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. కలుపు మొక్కలాంటి కాంగ్రెస్‌ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నామన్నారు. ఇవాళ దరిద్రం మళ్లీ మన గడప తొక్కిందని, బోగస్ మాటలతో, అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
'రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎగ్గొట్టారు. యూరియా దొరకడం లేదు, ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారు. రైతు ఇంటి ముందు మళ్లీ చావు డప్పు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరెంట్ కోతలతో మళ్లీ రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును పడకబెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన 1000 టీఎంసీల నీటిని కిందకు విడిచిపెట్టారు. ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకు?' అని కేటీఆర్ అన్నారు.
రాజకీయమే అజెండాగా పెట్టుకుని, కేసీఆర్‌కు పేరు రావొద్దనే ఉద్దేశంతో ఇవాళ ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, పాలకులు తెచ్చిన వికృతి కరువని పేర్కొన్నారు. పట్టిసీమ దగ్గర చంద్రబాబు నీళ్లు ఎత్తుతుంటే, నువ్వు కన్నెపల్లి దగ్గర ఎందుకు పంపులు ఆన్ చేయలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కట్టిన సదర్మాట్ బ్యారేజీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఉపయోగించుకోవడం చేతకావడం లేదన్నారు. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లోకి నీళ్లను లిఫ్ట్ చేసి ఉంటే ఇవాళ నీళ్ల జాతర సాగుతుండేదన్నారు.
నిర్మల్ ప్రాంతానికి, కేసీఆర్ ఉద్యమానికి ముఖ్యమైన అనుబంధం ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి తానే సారథ్యం వహిస్తానని కేసీఆర్ మొట్టమొదటిసారిగా ప్రకటించిన గడ్డ ఇది అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఈ గడ్డ మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. తుమ్మలు మొలిచిన ప్రాజెక్టుల్లో నీళ్లు పారించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు, వలసలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


