ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలు : ఎన్నాళ్లకెన్నాళ్లకు... ఆ ఒక్కచోట 'కాంగ్రెస్'కు ఊహించని ఊరట..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓ మున్సిపాలిటీలో ఊహించని ఊరట  దక్కింది. చీరాల మున్సిపాలిటీలో 10 వార్డులు గెలుచుకుని… ఏకంగా రెండో స్థానంలో నిలబడింది. 

Published on: Nov 8, 2026, 13:57:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గడచిన పన్నెండేళ్లుగా తీవ్ర రాజకీయ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి….. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని ఊరట లభించింది. 2014 నుంచి రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతున్న హస్తం పార్టీ…. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో తన సత్తా చాటుకుంది. ఏకంగా 10 వార్డుల్లో విక్టరీ కొట్టి… రెండో స్థానంలో నిలబడగలిగింది.

ఏపీ కాంగ్రెస్..! (Gemini AI Image)
ఏపీ కాంగ్రెస్..! (Gemini AI Image)

చీరాల మున్సిపాలిటీలోని మొత్తం 44 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 42 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. ఇందులో 10 వార్డులలో విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుని చీరాలలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వైఎస్‌ఆర్సీపీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది.

అంతా తానై నడిచిన ఆమంచి..!

ఏపీలో రాజకీయంగా పట్టు నిలుపుకోవడానికి పన్నెండేళ్లుగా నిరంతరం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చీరాల మున్సిపాలిటీలో లభించిన ఈ 10 వార్డుల గెలుపు కొండంత కొండంత అభయాన్ని ఇచ్చింది. స్థానిక రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వ పటిమ కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాలని స్థానికంగా విశ్లేషిస్తున్నారు.

చీరాల మున్సిపాలిటీ పీఠాన్ని ఎన్డీయే కూటమి దక్కించుకున్నప్పటికీ….. ప్రధాన ప్రతిపక్షాన్ని దాటుకుని రెండో స్థానంలో నిలవడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చీరాల ఫలితాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ప్రచారాన్ని ముందుండి నడిపించిన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పీఏసీ సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

చీరాల మున్సిపాలిటీని టీడీపీ నేతృత్వంలోని కూటమి కైవసం చేసుకుంది. మొత్తం 44 కౌన్సిలర్ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 25 స్థానాలను గెలుచుకుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ సొంతంగా 22 వార్డులలో జయకేతనం ఎగురవేగా, మిత్రపక్షాలైన జనసేన 2, బీజేపీ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను గెలుచుకుని రెండో స్థానంలో నిలవగా, వైసీపీ 8 స్థానాలతో మూడో స్థానానికి పడిపోయింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచిన ఏకైక మున్సిపాలిటీగా చీరాల నిలిచింది. మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ అభ్యర్థి హనీ స్పందన కైవసం చేసుకోగా…. కాంగ్రెస్ అభ్యర్థి దివ్య సుధాకర్ మూడో స్థానంలో నిలిచారు.

ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రస్థానం

కాంగ్రెస్ పార్టీతోనే ఆమంచి కృష్ణ మోహన్ రాజకీయ ప్రయాణం మొదలైంది. 2000లో వేటపాలెం జెడ్పీటీసీగా, 2006లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు.

రాష్ట్ర విభజన తదనంతరం 2014లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి….. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీకి మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పోటీ చేసినప్పటికీ, టీడీపీ అభ్యర్థి కరణం బలరామ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కరణం వర్గంతో తీవ్ర విభేదాలు రావడంతో పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 41,859 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

ఈ ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చీరాల ప్రాంతంలో ఆమంచి కృష్ణమోహన్‌కు ఉన్న వ్యక్తిగత ఓటు బ్యాంక్, బలమైన అనుచరగణం పార్టీ గుర్తుల కంటే శక్తివంతమైనవి. ఏ పార్టీలో ఉన్నా స్థానికంగా ఆయన తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూనే ఉన్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ వైఖరిపై అసంతృప్తితో రెబెల్ అభ్యర్థులను రంగంలోకి దింపి 13 మంది స్వతంత్రులు గెలవడానికి కారణమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ జెండా కింద మళ్లీ అదే తరహా ప్రభావం చూపించారు.

కూటమికి అధికారం దక్కినప్పటికీ…. కాంగ్రెస్ రెండో స్థానానికి రావడం గమనించదగిన పరిణామం. ఇప్పటికే తన ప్రభావాన్ని చూపిన ఆమంచి…. భవిష్యత్తులో కూడా కీలకంగా ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More