వర్షాలతో పంట నష్టం.. వెంటనే అంచనా వేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రవాయుగుండం అతలాకుతలం చేసింది. పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వెంటనే పంట నష్టంపై అంచనా వేయాలని ఆదేశించింది.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నష్ట వివరాలను సేకరించి, అత్యవసర పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు, జిల్లా యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు వర్షాల ప్రభావం, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బూడితి రాజశేఖర్, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులు, అలాగే పార్వతీపురం మన్యం, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు.
'వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో వెంటనే సర్వే చేపట్టి, నష్ట వివరాల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడం, అధిక తేమ వల్ల మరింత నష్టం వాటిల్లకుండా రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, పంటల రక్షణ చర్యలపై విస్తృత అవగాహన కల్పించాలి. అలాగే దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సేకరించి, ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా ముఖ్యమైన రహదారులకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలి. జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలి.' అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
మరోవైపు ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని సాధ్యమైనంత మేర సంరక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. చెరువులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో నీటిని నిల్వ చేసి, భవిష్యత్తు సాగు, తాగునీటి అవసరాలకు సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంటలకు హాని కలిగించే నిల్వ నీటిని తొలగిస్తూనే, అనువైన ప్రాంతాల్లో వర్షపు నీటిని భద్రపరచాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ రైతులకు క్షేత్రస్థాయి మార్గదర్శనం, ప్రజలకు అవసరమైన సహాయం నిరంతరం అందించాలని ఆదేశించారు.
మత్స్యకారుల భద్రత
మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మన మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఒడిశా మత్స్యశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వేటకు వెళ్లిన మన చేపల పడవలకు సురక్షిత ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సముద్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి, మత్స్యకారులందరూ క్షేమంగా తమ స్వగ్రామాలకు తిరిగివచ్చే వరకు తీరప్రాంత జిల్లాల మత్స్యశాఖ అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
ఒడిశా అధికారుల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 యాంత్రిక పడవలను గోపాల్‌పూర్ పోర్టులోకి అనుమతించారు. వీటిలో ఇంజిన్ సమస్యతో నిలిచిపోయిన ఒక పడవను సురక్షితంగా లాగి తెచ్చి పోర్టులో లంగరు వేశారు. అలాగే అరయపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు మరో 16 పడవలు సురక్షితంగా చేరుకున్నాయి. గోపాల్‌పూర్ పోర్టులోకి మన పడవలను అనుమతించేలా ఒడిశా కలెక్టర్, పోర్టు అధికారులతో అక్కడి మత్స్యశాఖ పూర్తి సమన్వయం వహించింది. మత్స్యశాఖ కమిషనర్ నివేదించిన మిగిలిన రెండు పడవలు, వాటిలోని సిబ్బంది కూడా గోపాల్‌పూర్‌లో సురక్షితంగా ఉన్నారు.
'మత్స్యకారుల క్షేమ సమాచారాన్ని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి ధైర్యాన్ని అందించాం. అధికారులందరూ పడవల యజమానులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ప్రతి పడవ పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించాం. సముద్రంలో వాతావరణం అనుకూలించిన తర్వాతే ఈ పడవలన్నీ తమకు కేటాయించిన ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షిస్తారు. మత్స్యకారుల ప్రాణ రక్షణే మన ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. తీరప్రాంత జిల్లాల యంత్రాంగమంతా అత్యంత అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకుంటోంది.' అని అచ్చెన్నాయుడు చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


