Cyclone Akvan Update : అక్వాన్ తుపానుపై న్యూ అప్డేట్.. ఈ జిల్లాలకు మాత్రమే రెడ్ అలర్ట్

Cyclone Akvan Update : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం వైపు వస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Published on: Nov 19, 2026, 14:37:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తీవ్ర తుపాను అక్వాన్(Cyclone Akvan) వల్ల ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ప్రభావం ఉండే అవకాశం లేదు. భారత వాతావరణ శాఖ(IMD) తన ప్రాథమిక అంచనాలను సవరించింది. దీని ప్రకారం గురువారం (నవంబర్ 19, 2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం అనే మూడు జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

అక్వాన్ తుపాను అప్డేట్
అక్వాన్ తుపాను అప్డేట్

గతంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఇప్పుడు వాటిని నవంబర్ 19 కోసం ఆరెంజ్ అలర్ట్ పరిధిలోకి మార్చారు. నవంబర్ 20న రాష్ట్రంలో ఎక్కడా రెడ్ అలర్ట్‌లు లేవు. ఆ సమయంలో ఈ తుపాను ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే నవంబర్ 20న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అక్కడ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది.

ఇదిలా ఉండగా పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తుపాను వ్యవస్థ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఉదయం 8:30 గంటల సమయానికి ఇది నర్సాపురానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, కళింగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 400 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 490 కి.మీ, పూరీకి దక్షిణంగా 550 కి.మీ, చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఉత్తర-వాయువ్య దిశగా పయనించి శుక్రవారం మధ్యాహ్నానికి నర్సాపురం-పూరీల మధ్య-గోపాల్‌పూర్‌కు తూర్పున-ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 90-100 కి.మీ ఉండవచ్చు, గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 12 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి నుంచి అతి తేలికపాటి వర్షాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, గణాంక శాఖ నివేదిక ప్రకారం.. ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం వరకు ఇచ్చాపురంలో 12.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. గత 24 గంటల్లో, ఏ కేంద్రంలోనూ 9 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదు.

గురువారం నాడు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 90 నుండి 100 కి.మీ వేగంతో (కొన్నిసార్లు 110 కి.మీ వేగంతో) బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయవచ్చు. భారత వాతావరణ శాఖ(IMD) ప్రకారం.. నవంబర్ 20న తీర ప్రాంతాల్లో గాలి వేగం గరిష్టంగా 50 కి.మీ మించకపోవచ్చు, అంటే శుక్రవారం నాటికి గాలుల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో హై అలర్ట్

ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో శుక్రవారం తీరాన్ని దాటనున్న అక్వాన్ తుపాను నేపథ్యంలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల వచ్చిన అర్నాబ్, మురసు తుపానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు ఈ కొత్త సవాలును ఎదుర్కోవడానికి సిద్ధమైంది.

శ్రీకాకుళం జిల్లా అధికారులు, ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం పరిధిలో ఉన్న డొంకురు వంటి గ్రామాలను సందర్శించి, స్థానిక అధికారుల సన్నద్ధతను సమీక్షించారు. గత తుపానుల సమయంలో బహుదా నదికి వచ్చిన వరదల వల్ల ఇచ్చాపురం, సోంపేట, ఇతర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గత తుపానుల సమయంలో వరద నీటి కారణంగా అంతరాయం కలిగిన కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.

విజయనగరం కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి తీర ప్రాంత గ్రామాలైన పూసపాటిరేగ, భోగాపురంలో పరిస్థితిని సమీక్షించి, తుపానుకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, మత్స్యకారులు రాబోయే కొన్ని రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More