అర్నబ్‌ తుపాన్ బీభత్సం.. ఉత్తరాంధ్రలో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

Cyclone Arnab : అర్నబ్‌ తుపాన్ కొన్ని ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఉత్తరాంధ్రలో గరిష్ఠ వర్షపాతాలు నమోదు అయ్యాయి. మరోవైపు పలు విమానాలు రద్దు చేశారు.

Published on: Oct 28, 2026, 14:25:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అర్నబ్‌ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షాల వల్ల కోస్తా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తు తీవ్రతను వివరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి, నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని కోరారు.

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

విశాఖ, విజయనగరంలో రికార్డు స్థాయి వర్షపాతం

ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు:

26 సెంటీమీటర్లు: విజయనగరం జిల్లా గరివిడి.

25 సెంటీమీటర్లు: అనకాపల్లి, శృంగవరపు కోట, వేపాడ, చీపురుపల్లి.

24 సెంటీమీటర్లు: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, విజయనగరం జిల్లా మెంటాడ, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి.

23 సెంటీమీటర్లు: విజయనగరం జిల్లా గంట్యాడ, శ్రీకాకుళం జిల్లా రణస్థలం.

22 సెంటీమీటర్లు: గజపతినగరం, నెల్లిమర్ల, విశాఖపట్నం సిటీ, మెరకముడిదాం.

21 సెంటీమీటర్లు: విజయనగరం.

33 విమాన సర్వీసులు రద్దు

ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం మొత్తం 33 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 17 విమానాలతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన 16 విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా శంషాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లే విమానాలపై ఈ ప్రభావం పడింది.

తుపాన్ నష్టంపై ప్రాథమిక అంచనాలను వివరిస్తూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ప్రభుత్వం ముందుస్తుగా చేపట్టిన ముందస్తు జాగ్రత్తల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి దాదాపు 28,000 మందికి పైగా ప్రజలను సురక్షితమైన పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు.

14 జిల్లాల్లో సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్టుగా పేర్కొన్నారు. 'భారీ వర్షాలకు సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట, 10,450 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. తీరప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమవ్వగా, అనేక చోట్ల విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది.' అని చంద్రబాబు వివరించారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యుత్, మంచినీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రంతో పాటు జిల్లాల్లోని కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. పూర్తిస్థాయి నష్టపరిహార నివేదికను త్వరలోనే కేంద్రానికి అందిస్తామని, సహాయక చర్యల్లో కేంద్ర సంస్థలు సహకరించాలని కోరుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More