తీవ్ర తుపానుగా మెుంథా.. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం.. ఇప్పటికే మెుదైలన బీభత్సం!

మెుంథా తుపాను బీభత్సం మెుదలైంది. తీవ్ర తుపానుగా బలపడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి.

Updated on: Oct 28, 2025, 09:31:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెుంథా తీవ్ర తుపానుగా బలపడింది. ఆంధ్రప్రదేశ్‌ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తీవ్ర తుపాను మారిన మెుంథా ఏపీ వైపు దూసుకువస్తోంది. దీంతో పరిస్థితులు గంటగంటకు మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలో మీటర్లు వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదిలిందన విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం నాడు 18 గంటలపాటు తుపాను ఎఫెక్ట్ కనిపించనుంది.

తీవ్ర తుపానుగా మెుంథా
తీవ్ర తుపానుగా మెుంథా

మంగళవారం సాయంత్రం లేదా రాత్రి నాటికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటనుంది. ఈ సమయంలో తుపాను బీభత్సం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు గరిష్టంగా 110 కిలో మీటర్ల వేగంతో, ఇతర ప్రాంతాల్లో 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇక విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరో హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరిక ఇచ్చింది.

ఇక కొనసీమ జిల్లాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నుంచి గాలుల తీవ్రత మరింత పెరగనుంది. కాకినాడ జిల్లాలోని తీరంలో అలల ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. తుపాను ప్రభావంతో విశాఖలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే రైళ్లు, విమాన సర్వీసులు రద్దు చేశారు. విజయవాడలోనూ వర్షం జోరుగా పడుతుంది. బాపట్ల, ప్రకాశ, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు.. ఇలా అన్ని జిల్లాల్లో తుపాను ప్రభావం కనిపిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు.

మెుంథా తుపాను తీరానికి దగ్గరగా కదులుతున్నందున తీరప్రాంతాలలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, నష్టాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల నివాసితులను ఎటువంటి ఆలస్యం లేకుండా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఆహారం, సురక్షితమైన తాగునీటిని అందించాలని, పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More