...
...
Next Story

ఏపీలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. వర్షాలతో అతలాకుతలం.. పలు విమానాలు రద్దు, దారి మళ్లింపు!

Andhra Pradesh Rains : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల ప్రభావంతో పలు విమనాలు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు.

Published on: Sep 24, 2026, 12:31:04 IST
Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం, దట్టమైన మేఘాల కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారత వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం - పోలాకి మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటికీ దీని ప్రభావం మరో 12 గంటల పాటు తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

తీరం దాటే సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విజయనగరం జిల్లా తెర్లాం, బాడంగి, డెంకాడ మండలాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పులు, విజిబిలిటీ తగ్గడం వల్ల ఎయిర్‌పోర్టు అధికారులు పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు మరికొన్నింటిని రద్దు చేశారు. విశాఖపట్నం – విజయవాడ (ఇండిగో) ప్రతికూల పరిస్థితుల వల్ల ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో ఈ విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.

హైదరాబాద్ – రాజమహేంద్రవరం (స్టార్ ఎయిర్‌లైన్స్) రాజమండ్రి వద్ద అనుకూలించని వాతావరణం కారణంగా బెంగళూరుకు డైవర్ట్ చేశారు. విమాన ప్రయాణాలు పెట్టుకున్నవారు విమానాశ్రయానికి బయలుదేరే ముందే ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించి, కరెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఎయిర్‌పోర్టు అథారిటీ కోరింది.

రాబోయే 48 గంటల పాటు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, నదులు, కాలువల వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ నగరం పరిధిలో బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. గంగవరం నుండి పెదగంట్యాడ వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఈ వర్షాల వల్ల కోస్తా తీరప్రాంతాల్లో వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks