బంగాళాఖాతంలో వాయుగుండం... విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం, భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం రూపుదిద్దుకుంటోంది. దీని ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Published on: Sep 22, 2026, 10:56:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పశ్చిమమధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారుతోంది. గడిచిన 6 గంటల కాలంలో ఈ వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా పయనించిందని వాతావరణ శాఖ మరియు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్, పూరీలకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే ఏపీలోని కళింగపట్నానికి 230 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో తీరానికి దగ్గరగా కదులుతోంది. రాబోయే 12 గంటల వ్యవధిలో ఇది మరింత బలపడి 'తీవ్ర వాయుగుండం' (Deep Depression)గా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

విశాఖ -గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం

తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఇది మరింత ముందుకు కదిలి, రేపు రాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో విశాఖపట్నం నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

తీరప్రాంత జిల్లాలకు భారీ వర్ష సూచన

ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉన్న ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.

గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, తీరప్రాంత నివాసులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం విపత్తు నిర్వహణ శాఖ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని, స్థానిక యంత్రాంగం ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More