చౌక ధరల డిపోల్లో స్టీమ్ రైస్.. త్వరలో 500 గ్రాముల కందిపప్పు పంపిణీ

చౌక ధరల డిపోల ద్వార త్వరలో స్టీమ్ రైస్ అందించనున్నట్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా 9 వేల మెట్రిక్ టన్నులు ప్రతి నెలా అందజేస్తామన్నారు.

Published on: Jul 29, 2026, 06:40:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

‘చౌక ధరల డిపో ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ప్రజలు ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు? ప్రతి కేజీ మీద రూ.56 మేర రాయితీని వెచ్చిస్తుంటే ఆ బియ్యం ప్రజలకు ఎందుకు అక్కరకు రాకుండాపోతున్నాయి?' అనే విషయం మీద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లోతుగా అధ్యయనం చేసింది. నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రజా పంపిణీలో ఇప్పుడు అందిస్తున్న బియ్యం స్థానంలో, ప్రజలు ఆసక్తి చూపిస్తున్న స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరుగుతుందని గుర్తించామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుందని, బియ్యం పక్కదారి పట్టడం తగ్గుతుందని చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఢిల్లీలో ఆంధ్ర భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్

'రాష్ట్రంలో స్టీమ్ రైస్ అందించే ప్రయోగాన్ని రాష్ట్రంలోని 42 వేల పాఠశాలలు, 4 వేల వసతి గృహాల్లో అమలు చేశాం. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో రాష్ట్రవ్యాప్తంగా స్టీమ్ రైస్ అందిస్తూ, నాణ్యమైన భోజనం పిల్లలకు అందిస్తున్నాం. దీనికి రైతులు తగిన విధంగా సహకరించి 2.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎలాంటి అధిక బోనస్‌లు ఆశించకుండా మాకు అందించారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకెళ్లినపుడు, ప్రజా పంపిణీలో కూడా స్టీమ్ రైస్ పంపిణీ చేయాలని మేం కోరినపుడు సానుకూల స్పందన వచ్చింది. ఓ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అమలు చేస్తామని చెప్పినపుడు కచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.' అని నాదెండ్ల చెప్పారు.

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశంలోనే తొలిసారి కాకినాడ జిల్లాలో చౌక ధరల డిపోల్లో నాణ్యమైన స్టీమ్ రైస్ బియ్యాన్ని అందజేయాలని నిర్ణయించామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజా పంపిణీ ద్వారా ప్రతి కార్డుదారుడికి, అలాగే పాఠశాలలు, హాస్టల్స్‌కు కలిపి జిల్లాకు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. ఇక్కడ వచ్చిన ఫలితాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్టీమ్ రైస్ ను చౌకడిపోల్లో అందించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. దీంతోపాటు రైతాంగం నుంచి వచ్చిన అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వ అధికారుల వద్ద ప్రస్తావించినపుడు బాయిల్డ్ రైస్ ధాన్యం కోటాను మరికొంత పెంచడానికి అంగీకరించారన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పనితీరును ఢిల్లీలో సగర్వంగా చెప్పుకొనే స్థితికి తీసుకురాగలిగామని నాదెండ్ల అన్నారు. నాణ్యమైన సరకులు, మేలైన సేవలు, లాజిస్టిక్స్, రవాణాలో పారదర్శకత, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భేష్ గా నిలిచి దేశంలోనే రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నిలుస్తోందన్నారు. 1000 మార్టులను జిల్లాల వారీగా అవసరం ఉన్న చోట ప్రారంభిస్తామన్నారు. దీనిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఎన్.సి.సి.ఎఫ్. మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. మీ మార్టుల్లో అతి తక్కువ ధరకే సరకులు లభిస్తాయని, 70 రకాల సరకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.

'ఆగస్టు 1 వ తేదీ నుంచి రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా బహిరంగ మార్కెట్లో రూ. 62 నుంచి రూ.64లు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్‌ను రూ.52లకు, బహిరంగ మార్కెట్లో రూ.58లు ధర ఉన్న గ్రేడ్ 1 రా రైస్ ను రూ.50లకు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో సేకరించి ఎఫ్.సి.ఐ. గోదాముల్లో భద్రపరిచిన స్వర్ణ వెరైటీ రకం బియ్యం లక్ష టన్నుల మేర నిల్వ ఉంది. దాన్ని కూడా వాడుకునేలా కేంద్ర మంత్రిని అనుమతి అడిగాం.' అని నాదెండ్ల చెప్పారు.

రాష్ట్రానికి 73 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం అని కేంద్ర మంత్రికి దగ్గర ప్రస్తావించామని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 30 వేల చౌకధరల దుకాణాల్లో బియ్యం, పంచదారతో పాటు నాణ్యమైన కందిపప్పును ప్రతి కార్డుదారుడికి 500 గ్రాముల మేర అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రానికి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి రావాల్సిన కేంద్ర నిధులు రూ.281 కోట్లను వెంటనే చెల్లించేలా కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More