జూలై 30 వరకు ఏపీలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం.. వర్షపాత లోటు 53.3 శాతం

IMD Weather : జూలై 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండనుంది. జులై 23 వరకు వర్షపాత లోటు 53.3 శాతంగా ఉంది.

Published on: Jul 24, 2026, 09:07:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. జులై 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసినప్పటికీ, తీవ్రమైన వర్షపాత లోటుపై అవి ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం జులై 23 నాటికి రాష్ట్రంలో మొత్తం వర్షపాత లోటు ఏకంగా 53.3 శాతానికి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణం
ఆంధ్రప్రదేశ్ వాతావరణం

రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో ఒక్క ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా మినహా, 27 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. అనేక జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. తీవ్ర లోటు ఉన్న జిల్లాలు విశాఖపట్నం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వర్షపాత లోటు 60 శాతం నుండి 76 శాతం వరకు ఉంది. వీటిని తీవ్ర లోటు విభాగాలుగా వర్గీకరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ ఏకంగా 76.8 శాతం వర్షపాత లోటు నమోదైంది.

జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 223 మిమీ నమోదు కావాల్సి ఉండగా, రాష్ట్రంలో కేవలం 104.1 మిమీ మాత్రమే కురిసింది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, జులై మొదటి మూడు వారాల్లో తీవ్ర ఎండలు, పొడి వాతావరణం నెలకొంది. జులైలో సాధారణంగా కురవాల్సిన 125.7 మిమీ వర్షపాతానికి గాను కేవలం 31.4 మిమీ మాత్రమే నమోదైంది.

రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో కేవలం 2 మండలాలు మాత్రమే (రెండూ నెల్లూరు జిల్లాలోనే) అత్యధిక వర్షపాతం పొందాయి. 13 మండలాల్లో అధిక వర్షపాతం, 74 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన వాటిలో 359 మండలాలు వర్షపాత లోటుతోను, 240 మండలాలు తీవ్ర వర్షపాత లోటుతోను అల్లాడుతున్నాయి.

అమరావతి వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం జులై 30 వరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. జులై 24, 25 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. కాకినాడ జిల్లాలోని వాకలపూడిలో అత్యధికంగా 14.62 మిమీ వర్షపాతం నమోదు కాగా, ఎన్టీఆర్, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో స్వల్పంగా జల్లులు కురిశాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More