ఐడీబీఐ బ్యాంక్ అమ్మకంలో పారదర్శకత లోపించింది: రాష్ట్రపతికి ఈఏఎస్ శర్మ లేఖ
ఐడీబీఐ బ్యాంక్‌ను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విక్రయించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. పబ్లిక్ సెక్టార్ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ప్రజా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఐడీబీఐ (IDBI) బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాల విక్రయంపై కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రముఖ సామాజిక వేత్త ఈఏఎస్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాంక్‌ను కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌కు అప్పగించే ప్రతిపాదనను తక్షణమే నిలిపివేసి, ఉపసంహరణ నిర్ణయంపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. సీపీఎస్ఈలలో (CPSEs) ప్రభుత్వ వాటాలు ప్రజా ప్రతినిధిగా రాష్ట్రపతి పేరిటే ఉంటాయని, కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సీపీఎస్ఈల ప్రాధాన్యం - గణాంకాలు
దేశంలో ఉన్న 475 ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) ప్రజల తరఫున రాష్ట్రపతి పేరిట రూ.4,50,740 కోట్ల ఈక్విటీ వాటాలు ఉన్నాయని ఈఏఎస్ శర్మ తన లేఖలో గుర్తుచేశారు. ఈ సంస్థల్లో 7,81,552 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇవి ఏడాదికి రూ.3,08,674 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడంతో పాటు రూ.1,38,503 కోట్ల మేర డివిడెండ్లను ప్రకటిస్తున్నాయని విశ్లేషించారు.
'స్వతంత్ర విచారణ జరిపించాలి'
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి సంబంధించిన న్యాయబద్ధత, ఔచిత్యంపై స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించి, ఆ నివేదికను పార్లమెంట్ ముందు ఉంచాలని ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. ఆ నివేదిక వచ్చే వరకు కెనడా సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌కు యాజమాన్య బాధ్యతలు అప్పగించే ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.
"లోటు భర్తీకి నిధుల సేకరణ కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నామనడం సరికాదు. ప్రభుత్వ రంగాన్ని కొనుగోలు చేసే ప్రైవేట్ సంస్థలు కూడా భారతీయ బ్యాంకుల నుంచే రుణాలు తీసుకుంటున్నాయి" అని శర్మ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం సీపీఎస్ఈలు సంక్షేమానికి కట్టుబడి ఉండాలని, ప్రైవేటీకరణ వల్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పారదర్శకత లేని విక్రయ ప్రక్రియ
కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు రూ.52,878 కోట్లకు ఐడీబీఐ బ్యాంక్‌ను కట్టబెడితే, కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీలు (LIC) కేవలం మైనారిటీ వాటాదారులుగా మిగిలిపోతారని విమర్శించారు. స్వదేశీ ప్రభుత్వ రంగ సంస్థలను వేలంలో పాల్గొనకుండా నిరోధించి, విదేశీ సంస్థకు తలుపులు బార్లా తెరవడం వెనుక పారదర్శకత లోపించిందని ఆరోపించారు. బ్యాంక్ ఆస్తుల విలువను లెక్కించిన ఏజెన్సీల వివరాలు, అనుసరించిన విధానాలను పార్లమెంట్‌కు కానీ, ప్రజలకు కానీ వెల్లడించలేదని ఆయన తప్పుపట్టారు.
ఎవరీ ఈఏఎస్ శర్మ?
ఈఏఎస్ శర్మ 1965 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ (IAS) అధికారి. కేంద్ర విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తన 35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో విధానపరమైన విభేదాల కారణంగా ఆయన ఏకంగా 26 సార్లు బదిలీ అయ్యారు. ప్రభుత్వ విధానాలతో విభేదిస్తూ నవంబర్ 2000లో ఆర్థిక శాఖ కార్యదర్శి పదవి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నారు.
అనంతరం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. విశాఖపట్నంలో డేటా సెంటర్లు, డీమోనిటైజేషన్, నిర్వాసితుల సమస్యలు, గిరిజన ప్రాంతాల్లో మైనింగ్, పర్యావరణ పరిరక్షణ, పారదర్శకత వంటి అనేక ప్రజా సమస్యలపై ఆయన నిరంతరం గళం విప్పుతున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


