ఎస్ఈసీ లాలూచీ పడుతోంది.. ఎన్నికల నామినేషన్ల విధానాన్ని ఆన్లైన్ చేయాలి : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం దారుణంగా ఖూనీ చేస్తోందని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల నామినేషన్ల విధానాన్ని ఆన్లైన్ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనివ్వని పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం దారుణంగా ఖూనీ చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. తన పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి ఆదివారం రాజ్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వినతిపత్రం అందజేసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.

స్థానిక పోరులో పారదర్శకత పూర్తిగా కొరవడిందని జగన్ ఆరోపించారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సైతం అధికార పక్షంతో లాలూచీ పడినట్లు కనిపిస్తోందని విమర్శించారు. 'మున్సిపల్ ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల సమయానికి పరిణామాలు ఇంకెంత దారుణంగా ఉంటాయోనని ఆందోళనగా ఉంది. నామినేషన్లు వేయడానికి వెళ్లే ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.' అని జగన్ పేర్కొన్నారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శక వాతావరణంలో జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు జగన్ తెలిపారు. భౌతికంగా నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకుంటున్నందున, నామినేషన్ల విధానాన్ని ఆన్లైన్ లేదా సెంట్రలైజ్ చేయాలని జగన్ కోరారు. స్థానిక పోలీసుల వైఫల్యం నేపథ్యంలో కేంద్ర పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
'కౌంటింగ్ కేంద్రాలు, పోలింగ్ బూత్‌లు, ఈవీఎం/బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లలో నిరంతరం సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేయాలి. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు పూర్తిగా ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారు. కనీసం కానిస్టేబుల్, ఎస్సై స్థాయి కింది స్థాయి అధికారులైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు నిష్పాక్షికంగా సహకరించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉంది.' అని జగన్ అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలు నిర్వీర్యమైనప్పుడే కాక్రోచ్లు పుట్టుకొస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని, మన కార్యకర్తలు గట్టిగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. వాళ్లు దాడులు చేసినా, బెదిరించినా సహించి పోరాటం చేద్దాం.. త్వరలోనే మళ్లీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని అని ధైర్యం చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు, దేవుడు కూటమికి తగిన బుద్ధి చెబుతారని, వారిని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయడం ఖాయమని జగన్ వ్యాఖ్యానించారు.
హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ గడువు పెంచాలని కోరుతూ.. వైసీపీ వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఆదివారం విచారణ చేసిన న్యాయస్థానం.. నామినేషన్ల గడువు ముగియడంతో ఇప్పుడు మీరు వేసిన పిటిషన్ నిరార్థకమైందని కోర్టు పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోక్యం చేసుకోవద్దని తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల తమ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం కుదరలేదని వైసీపీ చెబుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


