AP Local Elections : నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ఎన్నికలా...? ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి - వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం కుప్పకూలిపోయిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నిక వేళ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు.

Published on: Oct 18, 2026, 07:02:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో తక్షణమే ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో విస్తృతంగా రాజకీయ హింస జరుగుతోందని, ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడిపై జగన్ నిప్పులు చెరిగారు. "ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. వరుసగా రెండో రోజు కూడా చంద్రబాబు శాంతిభద్రతల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తన పార్టీ శ్రేణులకు గూండాగిరీ చేసేందుకు లైసెన్స్ ఇచ్చి, పోలీసు యంత్రాంగాన్ని వారికి కొమ్ముకాసేలా ఉపయోగిస్తున్నారు. పొలిటికల్ టెర్రరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుపుతున్నారు," అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

పోలీసు యంత్రాంగం కళ్లముందే దౌర్జన్యాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. "నామినేషన్ కేంద్రాల ప్రాంగణంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కత్తులు, కర్రలతో తరిమితరిమి కొడుతున్నారు. రిటర్నింగ్ అధికారుల ఆఫీసుల్లోకి జొరబడి నామినేషన్ పత్రాలను చింపేస్తున్నారు. అర్థరాత్రి వేళ పోలీసులే స్వయంగా అభ్యర్థులను అపహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా కైవసం చేసుకునేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారు," అని విమర్శించారు.

ఎంపీలను కూడా వదల్లేదు - వైఎస్ జగన్

ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపాదికులుగా వెళ్లిన తమ పార్టీ ఎంపీలను కూడా వదల్లేదని, వారి చేతుల్లోని పత్రాలను లాక్కుని చింపివేశారని జగన్ తెలిపారు. "పోలీసుల సమక్షంలోనే ముగ్గురు ఎంపీలపై దాడులు జరిగాయి. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?" అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా అనేక ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయని జగన్ పేర్కొన్నారు.

"చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శనం. పులివెందులలో పోలీసులు జరిపిన కాల్పులు ప్రజాస్వామ్యంపై బాంబు దాడి లాంటివి. నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులను, ప్రతిపాదికులను పోలీసులు ఎందుకు కొట్టారు? తుపాకులు ఎందుకు పేల్చాల్సి వచ్చింది…..?" అని జగన్ నిలదీశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. సూప‌ర్-6, సూప‌ర్-7 హామీల పేరుతో ప్రజలను మోసం చేసి…. ఇప్పుడు ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More