...
...
Next Story

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్

ఎస్సీ, ఎస్టీల విద్యోన్నతికి చేయూత ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డీమ్డ్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేస్తుంది.

Published on: Jul 1, 2026, 14:16:57 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని డీమ్డ్ యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్(UG) కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’ (PMS-RTF) ప్రయోజనాలను వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ విధానంలో ఈ పథకాన్ని విస్తరిస్తూ జీవో జారీ చేశారు. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల పంపిణీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేయనున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్
ఫీజు రీయింబర్స్‌మెంట్

కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు భరిస్తుండగా, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాను పీ4 చొరవ ద్వారా స్పాన్సర్ల భాగస్వామ్యంతో సమకూరుస్తారు. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుండగా, మిగిలిన 25 శాతం రాష్ట్ర వాటాను పీ4 మోడల్ ద్వారా సేకరిస్తారు.

విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ పారదర్శకంగా అందేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆర్థిక విధానాన్ని నిర్దేశించింది. పీ4 స్పాన్సర్లు తమ వాటా నిధులను ప్రభుత్వ 'సీఎఫ్ఎమ్ఎస్' (CFMS) పోర్టల్ ద్వారా స్టేట్ ట్రెజరీలో జమ చేస్తారు. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలు కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ఎమ్ఎస్(PFMS) పోర్టల్ ద్వారా ఈ నిధులను ప్రాసెస్ చేస్తాయి.

డీమ్డ్ యూనివర్సిటీలలో ఫీజులు ఎక్కువగా ఉండటం వల్ల వెనుకబడిన విద్యార్థులు ఇబ్బంది పడేవారు. తాజా నిర్ణయంతో పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. రాష్ట్ర వాటా కొరత కారణంగా నిలిచిపోయే కేంద్ర ప్రభుత్వ నిధులను ఇప్పుడు పీ4 భాగస్వామ్యం ద్వారా పూర్తిగా వినియోగించుకోవచ్చు.

పీ4 మోడల్ ద్వారా విద్యా వృద్ధిలో ప్రైవేట్ వ్యక్తులు, దాతల భాగస్వామ్యం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నత విద్యలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ఒక పెద్ద మైలురాయి. డీమ్డ్ వర్సిటీలలో చదవాలనే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కలలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోకుండా ఈ జీవో అండగా నిలవనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe