...
...
Next Story

సౌదీలో చిక్కుకున్న తెలుగు ఉమ్రా యాత్రికులు.. హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలతో తెలుగు యాత్రికులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాత్రికుల క్షేమ సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ వెల్లడించింది.

Published on: Oct 25, 2026, 15:51:22 IST
Advertisement

పశ్చిమాసియాలో నెలకొన్న సమస్యలు, భద్రతా కారణాల నేపథ్యంలో సౌదీ అరేబియాలో విమాన సర్వీసులు హఠాత్తుగా రద్దయ్యాయి. దీంతో తెలుగు ఉమ్రా యాత్రికులు అక్కడే చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్‌టీఎస్(APNRTS) సంస్థ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ప్రత్యేక విమానం
ప్రత్యేక విమానం

మొత్తం 253 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికుల క్షేమ సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన న్యూ రాయల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో వెళ్లిన 40 మంది యాత్రికుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.

జెడ్డా (కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుంచి ఆదివారం (అక్టోబర్ 25, 2026) రాత్రి 10.50 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుంది.

ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అందించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం సౌదీ అరేబియాలో దాదాపు 3,000 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు చిక్కుపోయి ఉన్నారు. వీరిలో సుమారు 1,500 మంది రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందినవారే. ఏపీ నుంచి దాదాపు 400 నుంచి 500 మంది వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

విదేశాల్లో చిక్కుకున్న మన భక్తుల భద్రతపై ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ స్పందిస్తూ ప్రస్తుతం గుర్తించిన 253 మంది ఏపీ యాత్రికులతో తమ బృందాలు నిరంతరం టచ్‌లో ఉన్నాయన్నారు. వారి భోజనం, వసతి సౌకర్యాలను సమీక్షిస్తున్నామన్నారు. దమ్మామ్ నుంచి హైదరాబాద్‌కు మరొక చార్టర్డ్ ఫ్లైట్‌ నడిపేందుకు వివిధ విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ కేంద్ర విదేశాంగ శాఖ పర్యవేక్షణలో సహాయక చర్యలను వేగవంతం చేశాయి. మక్కా, జెడ్డాలో హెల్ప్ డెస్క్‌ల ద్వారా యాత్రికులకు తాత్కాలిక వసతి, కన్సులర్ సహాయం అందిస్తున్నారు.

దాదాపు 17,000 మంది భారతీయులు ఈ సీజన్‌లో ఉమ్రా యాత్రకు వెళ్లగా, అత్యధిక శాతం మంది ఇప్పటికే స్వదేశం చేరుకున్నారు. అయితే విమానాలు రద్దై సుదీర్ఘ కాలం అక్కడ ఉండాల్సి రావడంతో భక్తుల వద్ద ఉన్న డబ్బులు అయిపోతున్నాయని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారిని క్షేమంగా సొంత ఊళ్లకు చేర్చాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks