...
...
Next Story

గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి - 6 జిల్లాలకు హెచ్చరికలు జారీ..!

ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇన్ అండ్ ఔట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు దాటడంతో ఈ రాత్రికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 6 జిల్లాలను విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్రంగా అప్రమత్తం చేసింది.

Published on: Sep 26, 2026, 09:35:58 IST
Advertisement

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద నీటి మట్టం గంటగంటకూ వేగంగా పెరుగుతుండటంతో తీర ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ బ్యారేజీ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి
ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి

ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే, ఈరోజు రాత్రి నాటికి బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరి ప్రవాహం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తక్షణ చర్యలు చేపట్టింది. పరిస్థితిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. గోదావరి వరద ప్రభావం తీవ్రంగా ఉండే ఆరు ప్రధాన జిల్లాల కలెక్టర్లను, దిగువ స్థాయి యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేశారు.

ఈ జిల్లాలకు హెచ్చరికలు…

  • పోలవరం
  • తూర్పు గోదావరి
  • కాకినాడ
  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
  • ఏలూరు
  • పశ్చిమ గోదావరి

గోదావరి మధ్యలో ఉండే లంక గ్రామాలు వరద నీట మునిగే ముప్పు పొంచి ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

  • ప్రమాదకరమైన ప్రవాహాలు ఉన్నందున నదిలో స్నానాలు చేయడం లేదా చేపల వేటకు వెళ్లడం పూర్తిగా నిషేధం.
  • వరద నీరు పారుతున్న రోడ్లు, కాజ్‌వేలు, ముంపు వంతెనలపై ప్రయాణాలు చేయడానికి సాహసించవద్దు.
  • లోతట్టు ప్రాంతాల్లో ఉండే నివాసితులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలి.
  • నీటి ప్రవాహం వద్దకు వెళ్లడం లేదా సెల్ఫీలు దిగడం వంటి ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks