...
...
Next Story

సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

Godavari Water : పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు వెళ్లనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 2వ తేదీన ఆవిష్కృతంకానుంది.

Published on: Aug 29, 2026, 12:26:13 IST
Advertisement

సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకోనున్నాయి. విశాఖపట్నం ప్రాంత అవసరాల కోసం దాదాపు 27 టీఎంసీల నీటిని నిల్వ చేసి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం - పి.ఎల్. పురం వద్ద ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు జల హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున ఈ ప్రాంతానికి నీరు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

గోదావరి నది
గోదావరి నది

జనాభా, పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరిస్తున్న తరుణంలో నీటి వనరులు అవసరమైన విశాఖపట్నానికి ఈ నీటి మళ్లింపు ఎంతో కీలకం కానుంది. పోలవరం నీటిని కేవలం కాలానుగుణ సరఫరా లాగా మాత్రమే కాకుండా.. వైజాగ్ దీర్ఘకాలిక అవసరాలను తీర్చేలా నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఈ ప్రణాళిక ఉద్దేశం.

ఎడమ కాలువ ద్వారా తీసుకురానున్న నీటిలో, సుమారు 27 టీఎంసీల నీటిని విశాఖపట్నం ప్రాంత వినియోగానికి కేటాయించారు. ఈ నీటిని ఇప్పటికే ఉన్న, కొత్తగా ప్రతిపాదించిన వాటర్ స్టోరేజ్ కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా పంపిణీ చేయాలని యోచిస్తున్నారు. వీటిలో పెంజరువు, కృష్ణంపాలెం, కొండకర్ల ఆవ, గోపాలపట్నం ఆవ చెరువులతో పాటు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రాంగణంలోని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులో కణితి జలాశయం కీలక పాత్ర పోషించనుంది. అక్కడ సుమారు ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మిగిలిన 22 టీఎంసీల నీటిని, డిమాండ్‌ను బట్టి ఇతర వాటర్ స్టోరేజ్ కేంద్రాలు, సరఫరా వ్యవస్థల ద్వారా నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 2న నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న పాయకరావుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను హోం మంత్రి వంగాలపూడి అనిత ఇప్పటికే సమీక్షించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe