ఉగ్రరూపం దాల్చుతున్న వంశధార, నాగావళి... ఉత్తరాంధ్రకు వరద ముప్పు! హెచ్చరికలు జారీ
తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో వంశధార, నాగావళి నదులకు భారీగా వరద నీరు చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.
రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు నమోదవడంతో ప్రధాన నదులైన వంశధార, నాగావళి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులు వేగంగా నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల నివాసితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

పరిస్థితి తీవ్రతపై అధికారులు స్పందిస్తూ…. "ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వంశధార, నాగావళి నదుల్లో నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఈ సమయంలో ఈతకు వెళ్లడం కానీ, చేపల వేటకు వెళ్లడం కానీ అత్యంత ప్రమాదకరం" అని హెచ్చరించారు.
నదుల్లో పెరుగుతున్న వరద ప్రవాహం….
శ్రీకాకుళం జిల్లా గుండా ప్రవహించే ఈ రెండు ప్రధాన నదుల వద్ద వరద పరిస్థితిని విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తోంది. నాగావళి నదిపై ఉన్న తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద ప్రస్తుతం 24,639 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అధికారులు 23,250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అటు నారాయణపురం ఆనకట్ట వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అక్కడ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో రెండూ 76,000 క్యూసెక్కులుగా నమోదయ్యాయి.
మరోవైపు వంశధార నదిపై ఉన్న గొట్టా బారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గొట్టా బారేజ్ వద్ద ప్రస్తుతం 43,860 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ఇన్ ఫ్లోకు అనుగుణంగా 46,197 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ఉత్తరాంధ్రలో ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా విపత్తు సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. స్థానిక యంత్రాంగాన్ని, పోలీసులను, రెవెన్యూ శాఖలను అప్రమత్తం చేశామన్నారు. నదీ తీర ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

