ముంచుకొస్తున్న తుఫాన్..! ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. వాయుగుండం సోమవారం నాటికి తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ్టికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుపానుగా మారనుంది. మంగళవారం ఉదయానికి తీవ్రతుపానుగా బలపడుతుందని వాతావరణశాఖ వివరించింది.

మంగళవారం సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరం దాటే సమయములో గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది.మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం…. సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముందస్తు సహయక చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉంచారు.
ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగానికి తుపాను ఎస్వోపి ( స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) అమలుపై సూచనలు ఇచ్చారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం కుడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ అయ్యాయి.
అత్యవసర సమాచారం, సహయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నెంబర్లు సంప్రదించవచ్చు. లోతట్టు ప్రాంతప్రజలు అలెర్ట్ గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
ఇవాళ(ఆదివారం) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు.
సోమవారం(27-10-25) : బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మంగళవారం (28-10-25) : కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











