హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్.. పర్యాటకాన్ని పోత్సహించేలా ప్రచార కార్యక్రమం

ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్‌కు విశిష్ట స్థానం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. దేశీయ పర్యాటకాభివృద్ధితో ఆర్థిక పురోగతి, ఉపాధి విస్తరణ, సాంస్కృతిక వైభవ ప్రాచుర్యమే లక్ష్యంగా పెట్టుకుంది.

Published on: May 21, 2026, 06:02:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” పేరుతో ఏడాది పాటు కొనసాగే సమగ్ర పర్యాటక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇది కేవలం ప్రచార కార్యక్రమం మాత్రమే కాకుండా, రాష్ట్ర పర్యాటక రంగానికి నూతన దిశానిర్దేశం చేసే ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోనుందని మంత్రి స్పష్టం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక భవిష్యత్తుకు పునాది వేసే మహత్తర యత్నమన్నారు. ప్రభుత్వం, భాగస్వామ్య వర్గాలు, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టగలం అనే సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్
హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్

పర్యాటక పరంగా విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య ఏడాది ఏడాదికీ పెరుగుతుండగా, విదేశీ పర్యాటకులు భారతదేశానికి వచ్చే సంఖ్య తక్కువగా ఉండటం వల్ల దేశ సంపద విదేశాలకు వెళ్తోందన్నారు మంత్రి దుర్గేష్. ముఖ్యంగా వివాహ వేడుకలు, విశ్రాంతి పర్యటనలు, వినోద యాత్రల కోసం భారతీయులు విదేశాలకు అధికంగా వెళ్తున్నారని, ఆ ధోరణిని మార్చి దేశీయ పర్యాటకాన్ని ప్రజాదరణ పొందేలా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసి “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని విశిష్ట పర్యాటక ప్రదేశాలను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు దేశీయ పర్యాటకులను ఆకర్షించే కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అద్బుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని గండికోట వంటి “భారతదేశ గ్రాండ్ క్యానియన్”గా గుర్తింపు పొందిన ప్రదేశం నుంచి విశాఖపట్నం సముద్రతీర సౌందర్యం వరకు, అమరావతి ఆధ్యాత్మిక వైభవం నుంచి తిరుపతి భక్తి పర్యాటకం వరకు, మన్యం ప్రాంతాల సహజ అందాలు నుంచి గోదావరి–కృష్ణా–పెన్నా నదీ పరివాహక ప్రాంతాల సాంస్కృతిక సంపద వరకు ఆంధ్రప్రదేశ్ అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నప్పటికీ, శ్రీశైలం, పంచారామాలు, నవ వైష్ణవ క్షేత్రాలు వంటి అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలను సమగ్ర యాత్రా మార్గాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సమగ్ర పర్యాటక వలయాల నమూనాను అమలు చేస్తామని తెలిపారు.

అదేవిధంగా డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి దుర్గేష్ వివరించారు. తిరుపతి, అరకు లోయ, విశాఖపట్నం సముద్రతీరాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో వివాహ వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, పెట్టుబడి సదస్సులు, వ్యాపార సమావేశాలకు అనుకూలంగా సమావేశ-ప్రదర్శన కేంద్రాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని వ్యాపార-పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు రాష్ట్ర పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ప్రవాస తెలుగు కుటుంబం కనీసం ఐదు విదేశీ కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఆహ్వానించినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విశేష బలం చేకూరుతుందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని మంత్రి తెలిపారు.

'విమాన, రైలు, రహదారి, జలమార్గ అనుసంధాన పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ స్థితిలో ఉంది. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, కడప విమానాశ్రయాలతో పాటు త్వరలో గుంటూరు సమీపంలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందుతోంది. పర్యాటకుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను గణనీయంగా పెంపొందించాం. సేవల నాణ్యతను ఆధునీకరిస్తూ పర్యాటకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.' అని మంత్రి దుర్గేష్ చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More