విజయవాడలో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం!

విజయవాడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెయిలింగ్‌ను ఢీకొని ఈవీ కారు పూర్తిగా తగలబడింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనం అయ్యారు.

Published on: Oct 12, 2026, 19:34:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విజయవాడ నగర శివారులోని వెస్ట్ బైపాస్ రోడ్డుపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్ర వేగంతో వెళ్తున్న ఒక ఎలక్ట్రిక్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రభావంతో కారులోని బ్యాటరీ వ్యవస్థలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవదహనం కాగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

ఈవీ కారులో మంటలు
ఈవీ కారులో మంటలు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కు హాజరై తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, అగ్నిమాపక రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే నలుగురు కాలిబూడిదయ్యారు.

ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పోలీసు యంత్రాంగం గుర్తించింది. మృతులు నున్నకు చెందినవారిగా అధికారులు తెలుసుకున్నారు. చనిపోయినవారిలో కొమ్మారెడ్డి రాందేవ్, కొమ్మారెడ్డి అరుణ (రాందేవ్ తల్లి), ఒక చిన్నారి, తిగురు విజయ ఉన్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రసుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

వాహనం మితిమీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని విజయవాడ పోలీసులు తెలిపారు. వాహనం వేగంగా రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఈవీ కారు బ్యాటరీ బ్యాక్‌పై తీవ్రమైన ప్రభావం పడి, క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More