AP NTR Bharosa Pension Status : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం’కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల నుంచి అంచనాలకు మించి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ విడతలో దాదాపు 13 లక్షలకుపైగా దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ వెసులుబాటు కల్పించింది.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ పోర్టల్ ఏపీ సేవా ఆఫీస్ పోర్టల్ ( https://apseva.ap.gov.in/#/home ) ను ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలో కనిపించే 'Service Request Status Check' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ పింఛను అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. మీ పింఛను దరఖాస్తు సంఖ్య తప్పనిసరిగా 'PNS' అనే అక్షరాలతో ప్రారంభమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకవాలి.
- వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయగానే మీ దరఖాస్తు ప్రస్తుత స్థితి…. అది ఏ అధికారి పరిశీలనలో ఉందో స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.
- ప్రస్తుత స్టేటస్ ఆధారంగా మీ అప్లికేషన్ విషయంలో ఓ క్లారిటీకి రావొచ్చు.
మరోవైపు లక్షలాది దరఖాస్తుల తనిఖీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 24వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, సంక్షేమ సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి దరఖాస్తునూ అర్హత ప్రమాణాల ప్రకారం క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
పింఛను దరఖాస్తుదారులు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని సచివాలయానికి పిలిచినప్పుడు సరైన పత్రాలు అందించాలి. ఒకవేళ సరైన ఆధారాలు చూపించలేకపోతే లేదా తప్పు వివరాలు ఇస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.