త్వరలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌‌కు సంబంధించి మరిన్ని విడియోలు విడుదల చేస్తాను : బాధితురాలు

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల కిందట ఓ మహిళ అతడిపై ఆరోపణలు చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. మరోవైపు మరిన్ని వీడియోలు విడుదల చేస్తానని ఆ మహిళ చెబుతున్నారు.

Published on: Feb 5, 2026, 13:10:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై కొన్ని రోజుల కిందట ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తనపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులు చేశారని ఆమె ఆరోపణలు చేశారు. కొన్ని రోజులుగా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టుగా రైల్వే కోడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

అరవ శ్రీధర్(ఫైల్ ఫొటో)
అరవ శ్రీధర్(ఫైల్ ఫొటో)

'శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.' అని చంద్రశేఖర్ అన్నారు.

వీడియోలు విడుదల చేస్తా : బాధితురాలు

ఆ మహిళ తన న్యాయవాదితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఒత్తిడితోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మేము న్యాయం కోరుతూ హైకోర్టును కూడా ఆశ్రయించామన్నారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 25 కోట్లు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేశాననే ఆరోపణలను మహిళ తీవ్రంగా ఖండించారు. 'ఇది నిరాధారమైన ఆరోపణ. నాకు న్యాయం మాత్రమే కావాలి, డబ్బు కాదు. ఎమ్మెల్యే నన్ను మాత్రమే కాకుండా, చాలా మంది మహిళలను వివాహేతర సంబంధంతో మోసం చేశాడు. త్వరలో ఎమ్మెల్యేకు సంబంధించిన మరిన్ని వీడియోలను విడుదల చేస్తాను.' అని ఆమె తెలిపింది.

అరవ శ్రీధర్ వివాహం చేసుకుంటానని చెప్పి ఒక సంవత్సరం పాటు తనను లైంగికంగా వేధించాడని మహిళ ఆరోపించింది. అబార్షన్లు చేయించుకోవాలని బలవంతం చేశాడని, బెదిరింపులు, వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ జనవరి 27న ఆ మహిళ వీడియో ప్రకటన విడుదల చేయడంతో వివాదం చెలరేగింది.

ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన పార్టీ

మరోవైపు జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఎమ్మెల్యే శ్రీధర్‌ను ప్రశ్నించింది. సీనియర్ నాయకులు శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్‌లతో కూడిన కమిటీ శ్రీధర్‌ను రైల్వే కోడూరులో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విచారించింది. ఆయన వాదనను నమోదు చేసింది.

ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో పాటు నియోజకవర్గం నుండి దాదాపు 40 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా కమిటీ పిలిపించింది. ఎమ్మెల్యే ప్రవర్తన, ఇటీవలి పరిణామాలు, కింది స్థాయిలో పార్టీ ఇమేజ్‌పై ఈ వివాదం ప్రభావం గురించి సభ్యులు అభిప్రాయాన్ని సేకరించారు.

విచారణ తర్వాత అరవ శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. పార్టీ కమిటీకి పూర్తి వివరణ ఇచ్చానని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను వివరించానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నమోదైన కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More