...
...
Next Story

Cyclone Murasu : తుపానుతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మురసు అర్థం ఏంటి?

Cyclone Murasu : మురసు తుపాను ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి.

Published on: Nov 1, 2026, 20:48:50 IST
Advertisement

అర్నబ్ తుపాను తీరాన్ని తాకిన వారం రోజులకే.. ఇప్పుడు మురసు(Murasu) తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఇది నవంబర్ 2-3 తేదీల మధ్య రాత్రి వేళలో నెల్లూరు-నర్సాపురం మధ్య ప్రాంతంలో తీవ్ర తుపాను(Severe Cyclonic Storm)గా తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 120 కిలోమీటర్ల వేగం వరకు పెరగవచ్చు. తమిళ భాషలో మురసు అంటే యుద్ధ సమయంలో ఉపయోగించే 'డ్రమ్' అని అర్థం.

సైక్లోన్ మురసు
సైక్లోన్ మురసు

'ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం, అదే రోజున బలపడి మురసు తుపానుగా మారింది. బంగాళాఖాతంలో మురసు తుపాను మరింత బలపడుతోంది. ఇది నవంబర్ 2, 2026 ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. నవంబర్ 2 అర్ధరాత్రి నుండి నవంబర్ 3 తెల్లవారుజాములోపు నెల్లూరు-నర్సాపురం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది.' అని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

భారత వాతావరణ శాఖ ఉదయం 11:30 గంటలకు నమోదు చేసిన వివరాల ప్రకారం, ఈ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ఇది నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా సుమారు 560 కి.మీ., విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 660 కి.మీ., నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా 630 కి.మీ., మచిలీపట్నానికి ఆగ్నేయంగా 640 కి.మీ., ఒంగోలుకు తూర్పు-ఆగ్నేయంగా 680 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. సోమవారం (నవంబర్ 2) ఉదయం నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో మరింత తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఇది నవంబర్ 2 రాత్రి 11.30 గంటల నుండి నవంబర్ 3 ఉదయం 4 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుపాను తీరాన్ని తాకే ప్రదేశానికి సమీపంలో గాలి వేగం గంటకు 120 కిలోమీటర్లకు చేరవచ్చు.

అర్నాబ్ తుపాను ఉత్తరాంధ్ర ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈసారి మధ్య, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నవంబర్ 2వ తేదీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు.

నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రోజులూ తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుపాను తీరం దాటిన తర్వాత తెలంగాణ వైపు వెళ్లే అవకాశం ఉన్నందున, ఆ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో నవంబర్ 3న రెడ్ అలర్ట్ ప్రకటించారు.

తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొంది. 'మరో తుపాన్ ముప్పు నేపథ్యంలో ఢిల్లీ పర్యటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసుకున్నారు. వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారి, నవంబరు 2న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా. నవంబరు 3న ఉదయం తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. అర్నబ్‌ తుఫాను సహాయ చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు.' అని సీఎంవో కార్యాలయం తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks