వాతావరణంలో మళ్లీ మార్పులు చేసుకునే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో రాబోయే రోజుల్లో వరుసగా ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో మళ్లీ వర్షాలు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక సమాచారాన్ని వెల్లడించింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన బులెటిన్ లోని వివరాల ప్రకారం…. అక్టోబర్ 12వ తేదీ నాటికి ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం తీవ్రమై, అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్ర ప్రాంతంలోనే ఒక అల్పపీడనంగా మారేందుకు అనుకూల వాతావరణం ఉంది.
బలపడనున్న వాయుగుండం…!
ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశముంది. "ఈ వ్యవస్థ అక్టోబర్ 15వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మారవచ్చు," అని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఈ వాయుగుండం ఏ దిశగా పయనిస్తుంది? తీరం దాటే అవకాశం ఉందా లేదా? ఏ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం ఉంటుంది? అనే అంశాలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఏర్పడే వ్యవస్థ గమనం, తీవ్రతను బట్టి వర్షాల ప్రభావంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు వాతావరణ శాఖ జారీ చేసే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.