Vande Bharat Sleeper : విజయవాడ డివిజన్‌కు వందే భారత్ స్లీపర్ రైళ్లు.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే!

Vande Bharat Sleeper : దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి ప్రయోజనం చేకూర్చేలా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనుంది భారతీయ రైల్వే. త్వరలో విజయవాడ డివిజన్‌లో ఈ స్లీపర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Published on: Jul 22, 2026, 16:37:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ చైర్ కార్ సేవల విజయవంతం తర్వాత.. సుదీర్ఘ ప్రయాణాలను మరింత హాయిగా మార్చేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌కు దసరా పండుగ నాటికి తొలి వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వందే భారత్ స్లీపర్ రైళ్లు
వందే భారత్ స్లీపర్ రైళ్లు

ప్రస్తుతం విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే రాత్రివేళల్లో, సుదూర ప్రయాణాలు చేసేవారికి సౌకర్యవంతంగా ఉండేలా స్లీపర్ వెర్షన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ రైళ్లు విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి వసతులను ప్రయాణికులకు అందించనున్నాయి.

ప్రతి వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కేటగిరీలు అందుబాటులో ఉంటాయి. కోచ్ లోపల ఆహ్లాదకరమైన ఇంటీరియర్ డిజైన్‌తో పాటు ఆధునిక ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణంలో బయటి శబ్దాలు లోపలికి రాకుండా ప్రయాణికులు హాయిగా నిద్రపోయేందుకు సౌండ్‌ప్రూఫ్ సాంకేతికతను ఉపయోగించారు.

వేగవంతమైన వైఫై, ప్రతి సీటు వద్ద పవర్ ఛార్జింగ్ పాయింట్లు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే బోర్డులు ఉంటాయి. రైలు కదిలే ముందు, స్టేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా తెరుచుకునే తలుపులు ఉన్నాయి.

ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ప్రత్యేకంగా రూపొందించారు. వేగంతో పాటు ప్రయాణికుల భద్రతకు రైల్వే శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రైలు ప్రమాదాలను నివారించేందుకు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన కవచ్ సెన్సార్లు, సెన్సార్ల ఆధారిత ఆధునిక రక్షణ వ్యవస్థలను ఇందులో అమర్చారు.

రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రైలును విజయవాడ పరిధిలో ప్రారంభించేందుకు అవసరమైన ట్రాక్ అప్‌గ్రేడేషన్, సిగ్నలింగ్ పనుల ప్రిపరేషన్‌ను అధికారులు వేగవంతం చేస్తున్నారు. దసరా సమయానికి ఈ సేవలు అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి సమయం బాగా ఆదా అవ్వడంతో పాటు ప్రయాణం మరింత హాయిగా ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More