ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు.. బాలాత్రిపురసుందరిదేవిగా అమ్మవారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు బాలాత్రిపురసుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Published on: Oct 11, 2026, 14:51:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారుల వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల సమయానికి మొత్తం 17,576 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆలయ యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. అన్ని క్యూ లైన్ల ద్వారా ఉచిత దర్శన సదుపాయం కల్పించారు.

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

కొత్తగా ఏర్పాటు చేసిన పూజా మండపంలో కుంకుమార్చన కార్యక్రమాలు ప్రారంభం కాగా, సంప్రదాయబద్ధంగా యాగశాలలో చండీ హోమానికి సంబంధించిన ప్రాథమిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ రోజున జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆలయ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి మొదటి రోజు అలంకారం పవిత్రత, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా నిలుస్తుంది. భక్తులు జ్ఞానం, సద్బుద్ధి, మానసిక ప్రశాంతతను కోరుతూ అమ్మవారిని ఆరాధిస్తారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు.

విజయవాడ ఉత్సవ్ 2.0పై ప్రధాని లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విజయవాడ ఉత్సవ్ 2.0 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వ్యవహారాలలో విజయవాడ నగరానికి దానికంటూ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించి, పర్యాటకాన్ని పెంచి, ప్రజల సంస్కృతిని అనుసంధానించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్, సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో కార్యక్రమాలతో విజయవాడ ఉత్సవ్ 2.0 ఉంటుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం సాయంత్రం ఈ వేడుకలను ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ ఉత్సవం లక్ష్యమని ఎంపీ కేశినేని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే పోటీలు స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More