రేషన్ కార్డు చూపిస్తే చాలు రూ.35కి ఉల్లిపాయలు.. నెలకు 2 కిలోలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో రూ.35కు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక్కో రేషన్ కార్డుదారుడికి రెండు కిలోల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

Published on: Sep 30, 2026, 14:51:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పెరుగుతున్న ధరల ప్రభావాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఏపీలో రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35 రాయితీ ధరకు విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నుండి రేషన్ కార్డును చూపించి ఒక్కో కుటుంబం నెలకు గరిష్టంగా 2 కిలోల ఉల్లిపాయలను కొనుగోలు చేయవచ్చు.

ఉల్లిపాయలు
ఉల్లిపాయలు

విజయవాడలోని ఏఐసీసీ కాలనీ రైతు బజార్‌లో ఉల్లిపాయల పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఒక్కో రేషన్ కార్డుదారుడికి 2 కిలోల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. 'కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలతో ధరలు‌ పెరుగుతున్నాయి. ప్రజల‌పై భారం‌ పడకుండా రాయితీపై అందిస్తున్నాం. ధరల స్థిరీకరణకు‌ నిధిని ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. బియ్యం, ఉల్లి, పప్పులు సబ్సిడీపై అందించేలా ఏర్పాట్లు చేశాం.' అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

మార్కెట్ పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. విజయవాడలో లభించే స్పందన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లకు విస్తరిస్తారు.

సబ్సిడీ ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు ప్రభుత్వం నిబంధనలు కూడా పెట్టింది. ఉల్లిపాయల కోసం వచ్చేవారు తమ వెంట రేషన్ కార్డు తెచ్చుకోవాలి దానిని చూపిస్తే.. ప్రతీ కుటుంబానికి నెలకు గరిష్టంగా 2 కిలోల ఉల్లిపాయలను మాత్రమే రూ.35 చొప్పున అందిస్తారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి.. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూర్చనున్నారు.

ఇప్పటికే రూ.50కే కిలో సన్నబియ్యం అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లింగ్ అవుట్‌లెట్ల ద్వారా ఈ సబ్సిడీ బియ్యం విక్రయాలను చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా కిలో గోధుమ పిండిని, అలాగే రాయితీ ధరలకు పామాయిల్, కందిపప్పును కూడా సరఫరా చేయనున్నారు.

పంట వైవిధ్యీకరణ వ్యూహంలో భాగంగా రబీ సీజన్‌లో 8.81 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికలో 1.88 లక్షల హెక్టార్లలో శనగలు, 1.51 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 1.27 లక్షల హెక్టార్లలో మినుముల సాగును చేపట్టడం వంటివి ఉన్నాయి.

ముందుగా నమోదు చేసుకున్న రైతులు పండించిన రాగులు, కందిపప్పు, మినుములను 100 శాతం మేర కనీస మద్దతు ధర వద్ద ప్రభుత్వం సేకరించనుంది. అలాగే పెసలు, శనగలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటల ఉత్పత్తిలో 30 శాతం వరకు కూడా ఎంఎస్పీ వద్దే సేకరించనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More