ఎన్‌సీసీఎఫ్ ద్వారా 64 రకాల నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరలతో విక్రయం
ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, సరుకులు అందిస్తున్నట్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్‌సీసీఎఫ్ ద్వారా 64 రకాల నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరలతో విక్రయించనున్నట్టుగా వెల్లడించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే అత్యుత్తమ నాణ్యతతో కూడిన బియ్యం, నిత్యావసర సరుకులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో, రెసిడెంట్ కమిషనర్ చొరవతో ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్‌లెట్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మన రైతాంగం కష్టపడి పండించిన ధాన్యం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ముఖ్యంగా ఢిల్లీ నగరంలో స్థిరపడిన, నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన, నాణ్యమైన మన ఊరి రుచులను, వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్‌లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు.
రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేఎన్ఎం, బీపీటీ వంటి వివిధ రకాల బియ్యం వెరైటీలతో పాటు, ఎన్‌సీసీఎఫ్ (NCCF) ద్వారా సేకరించిన 64 రకాల నాణ్యమైన సరుకులను కూడా సబ్సిడీ రేట్లతో ఈ కౌంటర్ ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అందించే ఈ సేవల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా అర్హత గల నిపుణులను నియమించి పారదర్శకంగా సేవలు అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్, ప్రభుత్వ సలహాదారు ఏకే జైన్, ఏపీ భవన్ అధికారులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్సీసీఎఫ్ ఎండీతో మంత్రి చర్చలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) మేనేజింగ్ డైరెక్టర్‌ని మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా తీరు, ధరల నియంత్రణ, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సరుకులు అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై చర్చించారు.
ప్రజలందరికీ నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారాన్ని మరింత విస్తృతం చేస్తూ, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


