కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. శనివారం నాటికి 20 మంది చనిపోగా…. అర్ధరాత్రి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 21కి చేరింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం….

తీవ్ర గాయాలపాలైన వారికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. చాలా మందికి 70 శాతానికిపైగా కాలిన గాయాలు ఉండటంతో… మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరణాల సంఖ్య 21 గా ఉందని… అర్ధరాత్రి తర్వాత ఒకరు చనిపోయారని ఓ అధికారులు వెల్లడించారు. మృతుల్లో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల శ్రీనివాస్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన కుమారుడు అడబాలు అర్జున్ కూడా గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనకు కారణమైన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఘటనపై విచారణ జరుపుతామని దోషుల ఆస్తులు జప్తు చేసి జీవితఖైదు పడేలా చేస్తామని సీఎం చంద్రబాబు కూడా హెచ్చరించారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల్ల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
‘ కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ప్రకటిస్తున్నా’ అని ఎక్స్‌లో ప్రధానమంత్రి మోదీ తెలిపారు.