వేట్లపాలెం పేలుడు ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందజేత
కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో వేట్లపాలెంలో పేలుడు ఘటనలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వారిని చూసి మంత్రి దుర్గేష్ చలించిపోయారు.

ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ప్రకటించిన ఎక్స్ గ్రేషియా చెక్కులను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జనసేన పార్టీ ఇంఛార్జి, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబులతో కలిసి మంత్రి దుర్గేష్ అందించారు. విషాదంతో ఆ కుటుంబాల కళ్లల్లో గూడుకట్టుకున్న శోకాన్ని చూసి మంత్రి కందుల దుర్గేష్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన సామర్లకోటకు చెందిన దర్శిపాటి నాని(38), ఏడిద సంపత్ కుమార్(25), జి.మేడపాడు గ్రామానికి చెందిన గంపల మంగ(43), గంపల నాగరాజు(45), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని(44), గొడత మహేష్(41), గొడత వీరవెంకట రమణ(48), కడింపల్లి ధనరాజు(55), పెదబ్రహ్మదేవంకి చెందిన మకర రాఘవమ్మ(55) ల కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వారి గ్రామంలో సభ్యుల ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్న భరోసా కల్పించారు. వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసి ఓదార్చారు. పోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేం కానీ ఆ కుటుంబాలు రోడ్డున పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెబుతూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మీ ఇంట్లో ఒక బిడ్డగా, మీ అన్నదమ్ముడిగా తానున్నానని భరోసా ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ కంటతడి పెడుతూ.. చెక్కులు పంపిణీ చేశారు. కేవలం చెక్కులు ఇచ్చి వెళ్లడం కాకుండా, ప్రతి ఇంటి లోపలికి వెళ్లి వారి కష్టసుఖాలను మంత్రి దుర్గేష్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను విచారించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏం జరిగిందంటే..
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని వేట్లపాలెం బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటనలో పలువురు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 20 మందికిపైగా కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో 35 మంది వరకు కార్మికులు పని చేశారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు తీవ్రత దాటికి పక్క గ్రామంలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఓ పాఠశాలలోని స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయంటే పేలుడు ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


